తొడగొట్టనున్న రేవంత్.. బుడగ పేలిపోనుందా?
posted on Jun 12, 2021 @ 9:06PM
తెలంగాణ కాంగ్రెస్ లో సస్పెన్స్ కు తెర పడిపోనుందా... ఇక ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడిపోతుందా? కాంగ్రెస్ వైఫైలోనే ఉన్న అసంతృప్తి రాగాలన్నీ మళ్లీ గట్టిగా ఎత్తుకోనున్నాయా..? ఏతులు పలికిన మొనగాళ్లు ఇక రెస్ట్ తీసుకుంటారా? ఏం జరగబోతుంది?హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మకాం వేశారు. ఇక కొన్ని గంటల్లోనే పీసీసీ చీఫ్ ఎవరో తేలిపోనున్నది.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఇంకా కొందరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.పీసీసీ ప్రకటన వచ్చాకే వారు హైదరాబాద్ రానున్నారు. దాదాపు రేవంత్ రెడ్డి పేరే ఫైనలని హస్తినలో వినపడుతోంది. ఎప్పుడో ఫైనల్ అయినా ఎవరో ఒకరు..ఏదో ఒక పేరుతో అడ్డం పడుతుండటంతో.. అది ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లే తయారైంది. కనీసం ఇప్పటికైనా పీసీసీ చీఫ్ ను ప్రకటించి... అన్నీఉన్నా గాంధీభవన్ నోట్లో శని అన్నట్లు పడుకున్నకాంగ్రెస్ ఇకనైనా లేపుతారని అనుకోవచ్చు.
ఇప్పటిదా..ఎప్పటిదో.. ఈ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ. 2018లో కాంగ్రెస్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మొదలైంది ఇక ఉత్తమ్ వెళ్లుడే.. కొత్తోడు వచ్చుడేనని. అయినా అదే ఉత్తముడు ఏకంగా ఇప్పటికీ రెండున్నరేళ్లుగా ఆ కుర్చీని వదిలిపెట్టకుండా కూర్చున్నాడు. మధ్యలో రాజీనామా అని పద్ధతి కోసం చెప్పినా.. ఆ పద్దతి కోసమేనన్నట్లు అలాగే కొనసాగాడు... కొనసాగుతున్నాడు. అసలు ఆ పదవి కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి అప్పటి నుంచి దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు.
కాంగ్రెస్ నేతలు మంచానికి నాలుగు కోళ్లలా.... తలోవైపుకు లాగడంలో ఎక్స్ పెర్ట్స్. అలా రేవంత్ రెడ్డికి కుస్తీ, బాక్సింగ్, కబడ్డీ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేసినంత పనైంది. ఉన్నంతో రాష్ట్ర వ్యాపిత ఇమేజ్ ఉండి.. బలం.. బలగం ఉండి.. ఆర్ధికంగా కూడా బ్యాకప్ ఉన్నవాడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం నుంచి వచ్చాడని.. ఓటుకు నోటు కేసులో ఉన్నాడనే పాయింట్లు తప్ప... వేరే నెగెటివ్ పాయింట్స్ ఏమీ లేవు. అలాంటి రేవంత్ రెడ్డిని ఎలా ఎంపిక చేస్తారంటూ లెజెండ్ వీహెచ్ చాలాసార్లు ప్రశ్నించాడు.
ఇక పెద్దలు జానారెడ్డి గారైతే ఇప్పుడు.. మన...సాగర్..ఎన్నిక...అయ్యాక.. ఫైనల్ చేస్తే బాగుంటుందని లేఖ రాయడం.. సరే గెలిచే సాగర్ అనవసరంగా ఓడిపోతామని భయపడి అదిష్టానం దాన్ని పాలో అవడంతో మరో మూడు నెలలు వెనక్కు దేకించారు ఆ నిర్ణయాన్ని. ఇప్పుడు కూడా ఎప్పటికో అవుద్దని భయపడ్డారు..కాని ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంలో కొన్నికుదుపులు రావడంతో.. కాస్త స్పీడ్ పెంచారు. ఇప్పటికైనా గేరు మార్చకపోతే మారలేమని అర్ధమైనట్లుంది.. కథ ముందుకు కదిలింది. ఇక కొన్ని గంటల్లోనే రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడం...టీకాంగ్రెస్ లో తీన్ మార్ మొదలవటం ఖాయంగానే కనపడుతోంది.