బెల్లి లలిత అన్నకు ఎమ్మెల్సీ? ఈటల టార్గెట్ గా కేసీఆర్ సంచలనం..
posted on Jun 13, 2021 @ 10:43AM
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు స్థానంలో లేదు.. ఉద్యమ ద్రోహులే ప్రభుత్వంలో ఉన్నారు.. బంగారు తెలంగాణలో బలిదానాలకు గౌరవం లేదు.. ఇది కేసీఆర్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఉద్యమకారులు, విపక్షాలే కాదు సామాన్య జనాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో ఉన్న నేతలు, ఉద్యమంలో వారి పాత్రను గమనిస్తే... కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు నిజమని భావించక తప్పదు. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఈ వాదన మరింతగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఈటలను తొలగించడంపై జనాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న గులాబీ బాస్ కి కూడా ఈ విషయం అర్ధమైందని తెలుస్తోంది. నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం కూడా ఇలానే ఉందట.
ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం, తాజాగా ఈటల ఎపిసోడ్ తోడవడంతో మొదటికే మోసం వస్తుందనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారట. అందుకే జనాగ్రహం నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్.. సరికొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారట. ఈటెల రాజీనామా తో ఖాళి అయిన బీసి నాయకుడి స్థానాన్ని మరో బిసితో పాటు మలిదశ తెలంగాణా ఉద్యమానికి ఉపిరి పోసిన బెల్లి లలిత కుటుంబానికి ఇచ్చి అండగ ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందని సమాచారం.
22 ఏండ్ల క్రితం మార్చి 29, 1999లో భువనగిరిలో దారుణ హత్యకు గురైంది బెల్లి లలిత. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేసి 17 బావుల్లో పడేశారు దుండగులు. ఈ ఘటన అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు తేలింది.
బెల్లి లలిత హత్య తర్వాత నయూం భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కృష్ణ.. ఆ గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ తర్వాతే మళ్లీ కనిపించారు. దాదాపు 20 ఏండ్ల పాటు ఆయన రహస్యంగానే ఉన్నారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తే.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంతో పాటు బీసీకి సీటు ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. బెల్లి క్రిష్ణ యాదవ్ కి ఎమ్మెల్యే కోటలో MLC ఇచ్చి పార్టీలొకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తున్నది. దీనికి స్థానిక MLA తో పాటు బెల్లి క్రిష్ణయాదవ్ కు సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు MLAలతో పాటు మాజీ MLA కూడా చర్చలు జరిపారని తెలుస్తుంది. ప్రస్తుత భువనగిరి MLA సొంత ఊరు కుడా బెల్లి క్రిష్ణ యాదవ్ ఊరే కావడంతో ఇద్దరి మద్య మంచి సాన్నిహిత్యం ఉంది.
తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన బెల్లి లలిత కుటుంబానికి అండగా ఉండాలని గతంలోనే కేసీఆర్ భావించారట. బెల్లి క్రిష్ణ యాదవ్ కి రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించినా.. చివరి నిమిషంలో కొంత మంది నాయకుల వల్ల బడుగుల లింగయ్యకు ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని బహుజన సామాజిక ఉద్యమ నాయకుడైన బెల్లి క్రిష్ణకి MLC ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే అమరవీరుల కుటుంబానికి న్యాయం చేసినట్లు అవుతుందని టీఆర్ఎస్ లీడర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు దీనితో చెక్ పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు.