ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు? హామీలపై ఎందుకు మాట తప్పుడు?
posted on Jun 13, 2021 @ 11:46AM
ఒకటి.. రెండు.. మూడు.. ఇప్పుడు నాలుగోది. సీఎం జగన్ ఎన్నికల హామీలపై వరుసగా నాలుగో లేఖాస్త్రాన్ని సంధించారు ఎంపీ రఘురామ. అన్నీ ప్రజా సమస్యలే. అన్నీ జగన్ స్వయంగా ఇచ్చిన హామీలే. అన్నీ మాట తప్పి, మడమ తిప్పిన అంశాలే. నవ రత్నాల ముసుగులో మరుగున పడిన వైఫల్యాలను అక్షరాలా బయటకి తీస్తూ.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. తాజా లేఖలో కీలకమైన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌పై సీఎం జగన్‌ను నిలదీశారు.
ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రఘురామ. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఈ హామీతోనే ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందని.. ఇప్పుడు ఆ హామీని పక్కనపెట్టేయడం సరికాదన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారని.. ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని సీఎం జగన్‌రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ.
ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలనూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. 18వేల ఉపాధ్యాయ, 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయని లేఖలో తెలిపారు. వందల సంఖ్యలో సెక్రటేరియల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 3వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. కోర్టులో కేసుల కారణంగా అంతంత మాత్రమే భర్తీ అయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని.. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని రఘురామ తన లేఖలో నిలదీశారు. తన లేఖకు స్పందించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ.
వరుస లేఖలతో రఘురామ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే, తనపై జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్‌లో జగన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఓవైపు ఇలా తన వ్యక్తిగత రివేంజ్ తీర్చుకుంటూనే.. మరోవైపు ప్రజా సమస్యలపైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయంటూ లేఖలతో నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాయగా వాటిపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.
ఇంతకుముందు ఇలాంటివే మరో మూడు లేఖలు రాశారు. ఇచ్చిన హామీ మేరకు.. వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని.. ఏపీలో సీపీఎస్ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని.. పెళ్లి కానుక, షాదీ ముబారక్ సాయం పెంచాలని.. డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. తాజాగా, నాలుగో లేఖలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ సీఎం జగన్‌ను లేఖలో నిలదీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. ఎంపీ రఘురామ సీఎం జగన్‌రెడ్డికి రాస్తున్న లేఖలు ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.