యూపీ ఎన్నికల బరిలో ఎంఐఎం.. ఎవరికి లాభం?
posted on Jun 12, 2021 @ 6:59PM
ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైన ఓవైసీల కుటుంబ పార్టీ, అల్ ఇండియా మజ్లీస్ ఈ - ఇత్తెహాదుల్ ముస్లిమాన్ (ఏఐఎంఐఎం) పార్టీ గత కొంత కాలంగా, దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అన్ని రాష్త్రాలలో ఎన్నికల బరిలో దిగుతోంది. మహా రాష్ట్రలో రెండు అసెంబ్లీ స్థానాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకటి రెండు చోట్ల విజయం సాధించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బెంగాల్, తమిళనాడులో పోటీ చేసినా ఫలితం లేక పోయింది. బెంగాల్లో, ఐఎస్ఎఫ్’తో పొత్తు కుదిరినా కూటమి చివరి నిముషంలో ఎంఐఎంకు చెయ్యిచ్చి హస్తం పార్టీతో చేతులు కలిపింది. మరో వంక ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు జమిరుల్ హసన్’ పార్టీకి రాజీనామా చేసి మమతా బెనర్జీ గూటికి చేరారు. అయినా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పట్టువదలని విక్రమార్కునిలా ఏడు స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టారు. ఏడుగురు ఓడిపోతే పోయారు గానీ, ఒవైసీ బెంగాల్లో ఎంఐఎం ఉనికిని అయితే నిలబెట్టారు.
ఇదలా ఉంటే, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి,మార్చిలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 సీట్లలో అభ్యర్ధులు నిలిపేందుకు ఎంఐఎం సిద్ధమవుతోంది. అంతేకాదు, ఒవైసీ ఇప్పటికే మాజీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భార్ సారధ్యంలోని తొమ్మిది పార్టీల కూటమి, భగీధరీసంకల్ప మోర్చా (బీఎస్ఎం)తో పొత్తు కుదుర్చుకున్నారు.అయితే, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ, రాజ్భార్ సారధ్యంలోని ఎస్బీఎస్పీని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజ్భార్ ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సో, ఆయన కాషాయ కూటమి వైపు వెళ్ళినా, అసదుద్దీన్ ఒవైసీ, తమ కూటమిలోకి ఓబీసీ, దళిత,మైనారిటీలను చేర్చుకుని వందకు పైగా స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
ఎన్నికలలో పోటీ చేయడంతో పాటుగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి కూడా ఒవైసీ ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్టంలోని మొత్తం 75 జిల్లాలకు, జిల్లా అధ్యక్షులను నియమించారని, ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. నిజానికి ఎంఐఎం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నే 36 స్థానలకు పోటీ చేసింది.అన్ని చోట్లా ఓడి పోయింది. అయితే ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 24 సీట్లు గెలుచుకుంది.పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కొంత నష్ట పోయినా, పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోలేదు. ఈ పరిస్థితులలో ఎంఐఎంపొతే చేయడం వలన ముస్లిం ఓటు చీలిపోయి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తొమ్మిది పార్టీల కూటమి, ఎస్పీ లేదా బీఎస్పీతో పొత్తు పెట్టుకోకపోతే, యూపీలో బీజేపీని ఓడించడం అయ్యే పని కాదని కూడా పరిశీలకు భావిస్తున్నారు. ఎంఐఎం కూటమి చివరకు కాషాయ కూటమికి మేలు చేసేందుకు తప్ప ఇంకెందుకు పనికి రాదని విశ్లేషకులు అంటున్నారు. మరో వంక, ఎంఐఎం కాషాయ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, ముస్లిం ఓట్లను చీల్చెందుకే యూపీ బరిలో దిగుతోందని, ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఏది ఎలా ఉన్నప్పటికీ, హైదరాబాద్ పాతబస్తీ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతోంది.