వైఎస్ భారతికి ఎంపీ రఘురామ షాక్!
posted on Jun 17, 2021 @ 10:35AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. తన దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ సర్కార్ కు కొరకరాని కొయ్యలా మారిపోయారు. రోజుకో అంశంలో లేఖ రాస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి షాకిచ్చారు ఎంపీ రఘురామ రాజు. ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయనే వార్నింగ్ కూడా ఇచ్చారు రఘురామ.
సాక్షి టీవీ చానెల్ కు ఎంపీ రఘురామ గతంలోనే లీగల్ నోటీసులు పంపించారు. తాజాగా మరోసారి సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో నోటీసుకు సమాధానమివ్వాలని, అలా చేయకుంటే 50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీచానల్‌కు రఘురామ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర నోటీసు జారీ చేశారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా సాక్షి చానెల్ అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఎంపీ రఘురామ రాజు.
అంతేకాదు తన నోటీసుపై వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పారు ఎంపీ రఘురామ రాజు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వైఎస్ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఆ నోటీసులిచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆ నోటీసుపై సాక్షి చానెల్ స్పందించలేదు. తాజా నోటీసుపై కూా స్పందిస్తారో లేదో చూడాలి మరీ...