జూన్ 21న కేంద్ర కేబినెట్ విస్తరణ! ఏపీ ఎంపీకి ఛాన్స్ ?
posted on Jun 16, 2021 @ 5:58PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇంతవరకు ఒక్క సారి కూడా కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరగలేదు. ఒకరిద్దరు మంత్రులు కాలధర్మం చెందారు.ఒకరిద్దరిని కరోనా కాటేసింది. మొత్తంగా చూస్తే ఓ 20 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొందరు మంత్రుల మీద పని భారం ఎక్కువగా వుంది.
కొన్ని కీలక రాష్ట్రాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. మరోవంక వచ్చే సంవత్సరం ఆరంభంలో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవంక 2024లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బేస్ పెంచుకోవలసిన అవసరం వుంది. అదే విధంగా, కొవిడ్ షాక్ తర్వాత మిత్ర పక్షాలను అక్కున చేర్చుకుని,, ఎన్డీఎ స్ట్రక్చర్’ను మళ్ళీ బలంగా తెరమీదకు తీసుకు రావలసిన అవసరం ఏర్పడిందని, బీజేపీ, సంఘ్ పరివార్ నిర్ణయానికి వచ్చాయి.
ఈ నేపధ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై దృష్టిని కేంద్రీకరించారు. కరోనా సెకండ్ వేవ్ కొంత శాంతించిన నేపధ్యంలో, సంఘ్ నాయకులతో, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు సంప్రదింపులు చేస్తున్నారు. దేశంలో ఎక్కడిక్కడ,, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను జాతీయ నాయకుల పర్యవేక్షణలో స్థానిక నాయకులు, పరివార్ సంస్థల కార్యకర్తలు అధ్యయనం చేసి నివేదికలను పార్టీ నాయకత్వానికి సమర్పించారు. ఈనెల 21న కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని పక్కా సమాచారం.
ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు తప్పక స్థానం ఉంటుందని, ఢిల్లీ వర్గాలు ఘంటాపథంగా చెపుతున్నాయి. అందులో ఆంధ్ర ప్రదేశ్’కు సంబంధించి, పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, అందుకు షరతులు వర్తిస్తాయని, అంటున్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే, అప్పుడు ఆయన్ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సుముఖంగా లేరని, అదే విధంగా, బ్రదర్ చిరంజీవి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి రాజకీయ వేషం కట్టేందుకు కూడా సుముఖంగా లేరని, ఉండీ లేనట్లుగా ఉంటూ మెల్లిగా రాజకీయ ప్రస్థానాన్ని సాగించాలన్నదే పవన్ కళ్యాణ్ ప్లాన్ అని అంటున్నారు. సో, ఈ సారికి పవన్ కళ్యాణ్’కు ఛాన్స్ లేదని తెలుస్తోంది.
తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన సుగుణా చౌదరి, సీఎం రమేష్, టీజే వెంకటేష్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా, ఒక నిర్ణయానికి అయితే రాలేదని, ముఖ్యంగా ప్రధానమంత్రి అందుకు సుముఖంగా లేరని అంటున్నారు. ఈనేపధ్యంలో ఇప్పుడు ఇంకొకరిని మంత్రి వర్గంలోకి తీసుకుని ఇంకో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే, కంటే ఇప్పటికే, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్య సభ సభ్యునిగా ఉన్న జీవీఎల్ నరసింహ రావుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే, మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతకడం ఎందుకన్నట్లు, అన్ని విధాలా అర్హతలు ఉన్న జీవీఎల్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
జీవీఎల్ పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యునిగా సమర్ధంగా పనిచేయడమే కాకుండా, పార్టీలో ఐడిలాజికల్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు వుంది. సో.. ఏపీ నుంచి జీవీఎల్ పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లే అని, విశ్వసనీయ సమాచారం. ఇక తెలంగాణ విషయానికివస్తే, ఆ ఇద్దరిలో ఒకరు లేదా ఒక సర్ప్రైజ్ ఛాయస్ ఉంటుందని అంటున్నారు. అయితే, అది ఎవరన్నది మాత్రం .. సస్పెన్స్ గానే వుంది.