ఏపీకి త్వరలో కొత్త గవర్నర్?
posted on Jun 16, 2021 @ 4:09PM
ఆంధ్రప్రదేశ్ కు త్వరలో కొత్త గవర్నర్ రాబోతున్నారా? కేంద్ర సర్కార్ ఇప్పటికే ఆ దిశగా కసరత్తు పూర్తి చేసిందా? అంటే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ఏపీ ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ కు హస్తిన పిలుపు రావడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం, కేంద్ర హోంశాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరపడం.. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్ ను కలవడం జరిగింది.ఈ పరిణామాలన్ని గవర్నర్ మార్పు కు సంకేతాలు ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ 2019 జూలై 14న బాధ్యతలు స్వీకరించారు. ఒడిషాకు చెందిన ఆయన వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. 1934 ఆగస్టు3న ఆయన జన్మించారు. వయసు ఎక్కువగా ఉండటం వల్లే ఆయనను మార్చాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. వయసు రీత్యా గవర్నర్ చురుకుగా ఉండటం లేదు. ఆయన రాజ్ భవన్ విడిచి బయటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. రాజ్యాంగ పరమైన కార్యక్రమాలు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగం మినహా ఎక్కడికి ఆయన వెళ్లడం లేదు. అందుకే విశ్వభూషన్ హరిచందన్ ను మార్చాలని కేంద్రం నిర్ణయించిందని తెలుస్తోంది.
గవర్నర్ మార్పు అంశంపై ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ తోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారని సమాచారం. అందుకే ఢిల్లీ నుంచి రాగానే.. జగన్ సతీసమేతంగా వెళ్లి గవర్నర్ ను కలిశారని అంటున్నారు. జగన్ ను గవర్నర్ ను కలిసిన మరుసటి రోజే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో... ఆయన మార్పు ఖాయమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తదుపరి గవర్నర్ గా బెంగళూరు హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసి ఇటీవలే పదవి విరమణ చేసిన జస్టిస్ ను నియమించనున్నారని తెలుస్తోంది. గవర్నర్ మార్పుపై ఒకటి, రెండు రోజుల్లోనే కేంద్రం నుంచి ప్రకటన రావచ్చొంటున్నారు.
ఇటీవలే గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం ప్రభుత్వం పంపిన పేర్లను వెంటనే ఆమోదించలేదు గవర్నర్ విశ్వభూషణ్. సర్కార్ పంపిన పేర్లలో ఇద్దరిపై గవర్నర్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్చలొచ్చాయి. కేసులు ఉన్న కారణంగా తోట త్రిమూర్తులు, అప్పిరెడ్డి అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. అయితే సీఎం జగన్.. రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలిసిన వెంటనే ఆ నాలుగు పేర్లకు ఆమోదముద్ర పడింది. ఈ విషయంలో గవర్నర్ తీరుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆ వెంటనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గవర్నర్ మార్పు కోసమే విశ్వభూషణ్ ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.
మరోవైపు గవర్నర్ మార్పు వెనక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీ ఎంపీలకు బెర్త్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఏపీలో దూకుడు రాజకీయం చేయాలని భావిస్తున్న కేంద్రం పెద్దలు.. యాక్టివ్ గా ఉండే గవర్నర్ ను అపాయింట్ చేయాలని చూస్తుందని చెబుతున్నారు. వెస్ట్ బెంగాల్ తరహాలో దూకుడుగా ఉండే వ్యక్తిని గవర్నర్ గా నియమించాలని ప్లాన్ చేస్తుందని కూడా చెబుతున్నారు.