మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా సత్య నాదేళ్ల.. తెలుగు తేజానికి అరుదైన ఘనత
posted on Jun 17, 2021 @ 10:58AM
తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఆయనకు మరో కీలక పదవి దక్కింది. ప్రస్తుతం మెక్రో సాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. తాజాగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్లను నియమిస్తుస్తున్నట్లు మెక్రో సాఫ్ట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బోర్డు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ స్థానంలో త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు సత్య నాదేళ్ల. ఇక్కడ మరో ఘనత కూడా ఉంది. సీఈవోగా కొనసాగుతూనే చైర్మెన్ గా కూడా వ్యవహరించనున్నారు సత్యనాదేళ్ల. గతంలో బిల్ గేట్స్ ఇలా రెండు పదవులు ఒకేసారి నిర్వహించారు.
s2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్నారు. ఏడేళ్ల క్రితం స్టీవ్ బామర్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా సత్య నాదెళ్ల చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో థామ్సన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు థామ్సన్ స్థానంలో సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టబోతున్నారు.
గత ఏడాది మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన 'బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్' నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే మైక్రో సాఫ్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అందులో నిజం లేదని అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాలను ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్ గేట్స్ లైంగిక సంబంధాలు కొనసాగించారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఓ న్యాయ సంస్థతో విచారణ చేయించిందని సంచలన కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా బిల్ గేట్స్ దంపతులు వీడిపోయారు.