ఈటలకు రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్!.. హుజురాబాద్‌లో తీన్మార్..
posted on Jun 16, 2021 @ 7:00PM
ఈటల వర్సెస్ కేసీఆర్. ఈటల వర్సెస్ టీఆర్ఎస్. కొంతకాలంగా ఇదే వినిపిస్తోంది. హుజురాబాద్‌లో ఇరు వర్గాల మధ్య నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. ఈటల బీజేపీలో చేరడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఈటలను కారుతో ఢీకొట్టేందుకు అధికారపార్టీ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. గులాబీ దెబ్బను కాచుకునేందుకు ఈటల కమలం పువ్వు పట్టుకున్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే.. పోరు పక్కా హోరాహోరీ. కొంతకాలంగా ఇవే విశ్లేషణలు. అయితే.. అక్కడ ఈటల-బీజేపీ, కేసీఆర్-టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా అత్యంత బలంగా ఉందనే విషయం సైడ్ ట్రాక్ పడుతోంది.
కాంగ్రెస్ నుంచి ఖతర్నాక్ కేండిడేట్ కౌశిక్‌రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కనుక కంప్లీట్ ప్రెసిడెంట్ అయితే.. హుజురాబాద్ రాజకీయ ముఖచిత్రం మరోలా ఉంటుందనే విషయం మరుగున పడుతోంది. ఎందుకంటే.. కౌశిక్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మామూలోళ్లు కాదు.. వాళ్లిద్దరూ కలిసి.. సవాల్‌గా తీసుకుంటే.. ఇటు ఈటల అయినా.. అటు టీఆర్ఎస్ అయినా.. హుజురాబాద్‌లో లెక్కలు సరి చూసుకోవాల్సిందే. అల్లాటప్పాగా చెబుతున్న మాట కాదిది.. పక్కా లెక్కలతో చేస్తున్న విశ్లేషణ అంటోంది కాంగ్రెస్.
ఈటల రాజీనామాతో కాంగ్రెస్ సైతం ఇదే మంచి ఛాన్స్ అంటూ కాక మీదుంది. యంగ్ టర్క్, డైనమిక్ లీడర్, మాజీ క్రికెటర్ కౌశిక్‌రెడ్డి ఉండగా.. తమకు తిరుగులేదని భావిస్తోంది. గతంలో టీఆర్ఎస్‌కు లక్ష పైచిలుకు ఓట్లు వచ్చాయి. హస్తం పార్టీ 60వేలకు పైగా ఓట్లు సాధించింది. అప్పటి ఈటల ఓట్లు.. ఇప్పుడు కారు గుర్తుకు, పువ్వు గుర్తుకు మధ్య చీలుతాయంటున్నారు. అప్పుడు చేతి గుర్తుకు పడిన ఓట్లు అలానే మళ్లీ పడితే.. ఓట్ల లెక్క ప్రకారం కౌశిక్‌రెడ్డి గెలుపు ఖాయం. ఇదే లెక్కతో ఆయనిప్పుడు మరింత గట్టిగా ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారు. కౌశిక్‌రెడ్డి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కజిన్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు సైతం దన్నుగా నిలబడతారు. రెడ్డి కార్డు లాభిస్తుంది కూడా.
ఇక మరో కీలక అంశం రేవంత్‌రెడ్డి ఎపిసోడ్. రేపోమాపో రేవంత్‌కు పీసీసీ పగ్గాలు పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కన్ఫామ్ అయితే.. రాజకీయం మరింత రంజుగా మారడం గ్యారంటీ. ఎందుకంటే, రేవంత్ పీసీసీ పగ్గాలు చేపడితే.. ఆ తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నిక హుజురాబాదే అవుతుంది. ఆ ఉప ఎన్నికపై అధిష్టానం ఫోకస్ కూడా ఉంటుంది. తన సత్తా ఏంటో హైకమాండ్‌కు చూపించేందుకు రేవంత్‌రెడ్డి హుజురాబాద్ బైపోల్‌ను సవాల్‌గా తీసుకునే అవకాశం ఉంది. రేవంత్‌లాంటి చిచ్చరపిడుగు గట్టిగా ఫోకస్ చేస్తే.. అతనికి కౌశిక్‌రెడ్డి లాంటి యంగ్ టర్క్ తోడైతే.. కాంగ్రెస్ విజయావకాశాలను అసలే మాత్రం కొట్టిపడేయలేని అంశం. ఆ ఇద్దరు కలిసి.. కేసీఆర్-ఈటల, టీఆర్ఎస్-బీజేపీ దొందు దొందేనంటూ ఊదరగొట్టడం ఖాయం. రాజకీయ వ్యూహాలు, పదునైన విమర్శలతో రేవంత్‌రెడ్డి.. కౌశిక్‌రెడ్డి పక్షాన నిలబడితే.. ఇటు ఈటలకు, అటు టీఆర్ఎస్‌కు దబిడి దిబిడే.