టీడీపీ నేతల ఫ్యాక్షన్ మర్డర్.. వైసీపీ హత్యా రాజకీయం!
posted on Jun 17, 2021 @ 11:22AM
కాపు కాశారు. మందిమార్బలంతో పొంచి ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్న పగ. ఇప్పుడు అధికార పార్టీ అండతో రెచ్చిపోయారు. అన్నదమ్ములైన ఇద్దరు టీడీపీ నేతలను వెంటాడి.. వేటాడారు. వాహనంతో గుద్ది.. వేటకొడవళ్లతో నరికి దారుణంగా చంపేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఫ్యాక్షన్ డబుల్ మర్డర్‌తో సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారం కోల్పోయినప్పటి నుంచీ టీడీపీ నేతల వరుస హత్యలు ఏపీవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములైన మాజీ సర్పంచి నాగేశ్వరరెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిని కొందరు బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. ఘటనలో వాళ్లిద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మూడు రోజుల క్రితం మృతుల బంధువులు చనిపోయారు. మూడో రోజు దినం కోసం శ్మశానానికి వెళ్లారు ఆ ఇద్దరు బ్రదర్స్. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గం.. వారి కోసం స్కెచ్ వేసింది. శ్వశానం నుంచి తిరిగి వస్తుండగా.. స్పీడ్‌గా బొలేరో జీపుతో ఢీకొట్టారు. వాళ్లిద్దరు కిందపడగానే ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. దారుణంగా నరికి చంపేశారు. నిందితులు వైసీపీ నాయకులని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతిచెందిన అన్నదమ్ముల వర్గానికి, శ్రీకాంత్‌రెడ్డి అనే వర్గానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి.
పోలీసులు ఘటనపై ఇంకా కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. టీడీపీ నేతల హత్యతో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.