అంతా సిరిసిల్ల, సిద్ధిపేటలకేనా? తల్లడిల్లుతోన్న తెలంగాణం!
posted on Jun 17, 2021 @ 10:10AM
ఈ మధ్య సిరిసిల్లకు గానీ, సిద్ధిపేటకు గానీ వెళ్లారా? కొత్తగా వెళ్లిన వారు అవాక్కవుతారు.. గతంలో ఎప్పుడో వెళ్లి.. ఇప్పుడు మళ్లీ వెళితే.. ఆశ్చర్యపోతారు.. ఇది సిరిసిల్లేనా? అది సిద్ధిపేటేనా? అని నోరెళ్లబెడతారు. అంతా బాగుంటాయి ఆ రెండు పట్టణాలు. అచ్చం హైదరాబాద్‌లాంటి అభివృద్ధి అక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. ఆ రెండు ప్రాంతాలు పరస్పరం పోటీపడుతూ మౌలిక వసతుల్లో దూసుకుపోతున్నాయి. అద్దంలాంటి రోడ్లు.. అందమైన సర్కిళ్లు.. ఎటుచూసినా పచ్చదనం.. చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రత.. అందమైన ప్రభుత్వ భవనాలు.. హాస్టళ్లు.. స్టేడియాలు.. మార్కెట్లు.. స్టోరేజ్ యార్డ్లు.. స్కూళ్లు.. కాలేజీలు.. ఆసుపత్రులు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అబ్బో ఇది లేదు అది లేదు అనేది లేదు.. నిజంగా సిరిసిల్ల, సిద్ధిపేటలదే అదృష్టమంటే. కేసీఆర్ సొంత గడ్డ, ఆయన అల్లుడు హరీష్‌రావు ఇలాఖా కావడంతోనే సిద్ధిపేటలో అంత డెవలప్‌మెంట్ జరిగింది. కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్లను తన రాజకీయ వేదికగా చేసుకోవడంతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. సిరిసిల్ల సిగలో టెక్స్‌టైల్ పార్కు కొలువుదీరింది. తాజాగా, సిరిసిల్లను కోనసీమగా మారుస్తానంటూ హామీ ఇచ్చారు కేటీఆర్. సిరిసిల్లలో కొన్ని ప్రాంతాల్లో బంజారాహిల్స్ మాదిరి.. గజం భూమి లక్ష రూపాయలు పలుకుతోందంటే నమ్మాల్సిందే. డౌట్ ఉంటే వెళ్లి చూడాల్సిందే...
సిరిసిల్ల, సిద్ధిపేటలు బాగా అభివృద్ధి చెందటం సంతోషకరం. బహు బాగుంది కల్వకుంట్ల ఫ్యామిలీ పనితనం. ఆ అభివృద్ధికి వారిని అభినందించాల్సిందే. కానీ.. తెలంగాణ అంటే సిరిసిల్ల, సిద్ధిపేటలు మాత్రమే కాదని.. ఇంకా హైదరాబాద్ మినహా మరో 20 జిల్లాలు ఉన్నాయనే విషయం మరిచినట్టున్నారు. సిరిసిల్ల దాటి పక్క జిల్లాలో అడుగుపెడితే కనిపిస్తుంది అసలైన తెలంగాణ. సిద్ధిపేట వదిలి మరో జిల్లాలో ఎంట్రీ అయితే అడుగడుగునా వెనకబాటుతనమే. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్.. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా.. ఏ జిల్లా చూసినా అభివృద్ధికి ఆమడదూరమే. అంతెందుకు.. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా గొప్పలు చెప్పే వరంగల్‌ను చూస్తే తెలుస్తుంది ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో. దశాబ్దాలుగా సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిన ఎమ్‌జీఎమ్ హాస్పిటల్ ఉదంతం.. కేసీఆర్ కంటికి కనిపించడానికి ఇంత కాలం పట్టిందంటే ఆశ్చర్యమే.
హైదరాబాద్ అంటే నిజాంల కాలం నుంచే డెవలప్ అయిందనుకోండి. మరి, సిరిసిల్ల, సిద్ధిపేటలు ఈ ఏడేళ్లలోనే హైదరాబాద్ స్థాయికి ఎదగడం ఆయా ప్రాంతాల వారికి ఆనందదాయకమే అయినా.. మరి, మిగతా జిల్లాల పరిస్థితి ఏందనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకీ, ద్వంద్వ వైఖరి? ఎందుకీ సవతి చేష్టలు? కేవలం మీ ఇలాఖాలనే డెవలప్ చేసుకొని.. మీ రాజకీయ వేదిక పది కాలాల పాటు చల్లగుంటే సరిపోతుందా? మిగతా జిల్లాలు ఎలా ఉన్నా పర్లేదా? అంటూ నిలదీస్తున్నారు మిగతా జిల్లాల ప్రజలు.
తెలంగాణ వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వచ్చి ఎన్నెన్నో మాటలు చెప్పారు. అలా చేస్తా, ఇలా చేస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. మానేరు డ్యామ్‌లో బోటు షికార్లు.. ఓడ్డున స్టార్ హోటళ్లు.. అదేదో అమెరికాలోని డల్లాస్‌లా చేస్తానన్నారు కేసీఆర్. ఇప్పుడు కరీంనగర్‌ను చూస్తే.. డల్లాస్ సంగతి దేవుడెరుగు.. ముందు రోడ్లపై గుంతలు పూడ్చండి ముఖ్యమంత్రి గారూ అని వేడుకుంటున్నారు కరీంనగర్వాసులు. అప్పట్లో వరంగల్‌లోనూ రెండు రోజులు విడిది చేసి.. సుడిగాలి పర్యటనలతో ఊదరగొట్టి.. ఆ తర్వాత ఉసూరుమనిపించారు. ఇలా.. జిల్లా జిల్లాకు కేసీఆర్ ఇవ్వని హామీ లేదు.. ముల్కనూరు, గంగదేవిపల్లి లాంటి గ్రామాల్లో పర్యటించి మస్తు మాటలు చెప్పారు.. కానీ, వాటిని కనీసం అరకొరగానైనా నెరవేర్చిన పాపాన పోలేదు అంటున్నారు. ఏ జిల్లాను చూసినా అదే దౌర్బాగ్యం. కొత్త జిల్లాల పేరులైతే ఘనంగా పెట్టారు కానీ.. ఖజానా నుంచి కాసులు విదల్చకపోవడంతో అవి అలానే కునారిల్లుతున్నాయి. అది జోగులాంబ-గద్వాల జిల్లా అయినా.. జనగాం జిల్లా అయినా.. బంగారు తెలంగాణలో సిరిసిల్ల, సిద్ధిపేట మినహా ఏ జిల్లా చూసినా ఏముంది గర్వకారణం..?
సొంతింటి కల గజ్వేల్ వాసులకే నెరవేరుతుందా? అద్దాల్లాంటి రోడ్లు సిద్దిపేటలోనే ఉండాలా? సిరిసిల్ల మాత్రమే కోనసీమలా మారాలా? మరి, మిగతా జిల్లాల మాటేంటి? ఆయా జిల్లాల వాసులు టీఆర్ఎస్‌కు ఓటు వేయలేదా? అక్కడి వారు పన్నులు కట్టడం లేదా? వారంతా తెలంగాణ బిడ్డలు కారా? అని నిలదీస్తున్నారు అభివృద్ధికి నోచుకోని ప్రజలు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి.. రాష్ట్ర ఖజానా మీ గుప్పిట్లోనే ఉంది కాబట్టి.. మీ ప్రాంతాలు మాత్రమే తీర్చిదిద్దుకుంటారా? మరి మా సంగతేంటని నిగ్గదీసి అడుతున్నారు జనాలు. ఓహో.. మిగతా జిల్లాలూ డెవలప్ కావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఒక్కో టర్మ్‌లో.. ఒక్కో జిల్లా నుంచి పోటీ చేయాలన్న మాట..? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మరి, ఆ జిల్లాల ఆక్రందన ఆ ముగ్గురి చెవికి సోకుతుందా? ఎప్పటికైనా మిగతా జిల్లాల్లోనూ ఆభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తాయా? సిరిసిల్ల, సిద్ధిపేటలే కాకుండా మిగతా ప్రాంతాలూ బంగారు తెలంగాణగా మారుతాయా? ఏమో.....