జగన్ కు రఘురామ మరో షాక్! హైకోర్టులో పిటిషన్ తో కాక..
posted on Jun 22, 2021 @ 7:57PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోరాటం సాగిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ రాజు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ ఎన్నికల హామీలపై రోజుకో లేఖ రాస్తూ కాక రేపుతున్న రఘురామ.. తాజాగా జగన్ రెడ్డి వ్యాపారాలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు.
సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని గతంలో సీబీఐ నిర్ధారించిందని తన పిటిషన్ లో చెప్పారు ఎంపీ రఘురామ. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని రఘురామ పాయింట్ చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురా తన పిటిషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. రఘురామ పిటిషన్ పై త్వరలోనే హైకోర్టులో విచారణ జరగనుంది.
‘గ్రంధి ఈశ్వరరావు 1999లో సరస్వతి కంపెనీని ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డి, మరో ఇద్దరు ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత ఒరిజినల్ ప్రమోటర్లు కంపెనీని విడిచిపెట్టారు. గుంటూరు జిల్లాలో 266 హెక్టార్లు లైమ్‌స్టోన్ ప్రాస్పెక్టింగ్ లీజుకోసం 2008 మార్చి, ఏప్రిల్‌లలో కంపెనీ దరఖాస్తు చేసింది. మైనింగ్ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాక మెమోరాండం ఆఫ్ అసోసియేషన్‌ను కంపెనీ సవరించింది. మైనింగ్ లీజు దరఖాస్తును అధికారులు స్వీకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం మైనింగ్ లీజును మంజూరు చేసింది. ఆ కంపెనీ ముఖ్యమంత్రి కుమారుడు, కోడలు, భార్యది కావడంతో అధికారులు అనుమతులిచ్చారు.మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో 2014లో అప్పటి ప్రభుత్వం యాజమాన్యానికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని అధికారులు.. మైనింగ్ లీజు మురిగిపోయినట్లుగా (ల్యాప్స్) ప్రకటిస్తూ అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ కంపెనీ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. జగన్‌మోహన్‌రెడ్డి సంపద రూ.11 లక్షల నుంచి రూ.45వేల కోట్లకు పెరిగిందని కనుగొంది. ఈ వ్యవహారంలో 2012-14 సంవత్సరాల్లో సీబీఐ.. జగన్‌మోహన్‌రెడ్డిపై 11 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 6 ఛార్జిషీట్లు వేసింది. అవి న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా మైనింగ్ లీజు మంజూరులో అక్రమాలు జరిగాయని సీబీఐ కనుగొంది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లీజు కాలపరిమితి ముగిసినదిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. మైనింగ్ లీజు కాలపరిమితి ముగిసినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో 2019 సెప్టెంబరు 30న ప్రభుత్వం తూతూ మంత్రంగా కౌంటర్ వేసింది. సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల్ని కోర్టు ముందు ఉంచలేదు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి.. రిట్‌ను అనుమతించారు. లీజు కాలపరిమితి ముగిసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. మైనింగ్ లీజును పునరుద్ధరించాలని ఆదేశించారు. సరస్వతి కంపెనీకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మోసపూరితంగా వ్యవహరించినప్పుడు.. ఆ విషయాన్ని పౌరుడిగా న్యాయస్థానం దృష్టికి తేవాల్సి ఉంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి’ అని రఘురామ తన పిటిషన్ లో కోరారు.