ఒక్క విద్యార్థి మరణించినా ప్రభుత్వానిదే బాధ్యత! ఏపీకి సుప్రీంకోర్టు..
posted on Jun 22, 2021 @ 5:03PM
అందరిది ఒక దారి ఐతే ఉలిపి కట్టెది ఇంకొక దారట .. అందరూ ఒక పద్ధతిలో నడుస్తూ వుంటే ఒక్కడు మాత్రం నాకీ పద్ధతి వద్దు. నేను వేరే దారినే పోతా అనేవాడి గురించి చెప్పటానికి ఈ సామెతను వాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఇప్పుడు సేమ్ ఇలానే ఉంది. కరోనా మహమ్మారి ప్రభావానికి స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టలేమంటూ చాలా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలోని సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేసింది. కాని ఏపీలో జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పరీక్షలపై పంతానికి పోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతోంది.
దేశంలో ఇప్పటివరకు 21 రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేశాయి.అయినా ఏపీ మాత్రం తన నిర్ణయం మార్చుకోవడం లేదు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, విపక్షాలు, ప్రజా సంఘాల ఎంతగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా పరీక్షలపై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న మొండి వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో గతంలోనే ఏపీ వైఖరి చెప్పాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాని అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లు ఇచ్చినా ఏపీ సర్కార్ మాత్రం ఇంకా స్పందించలేదు. దీంతో కేసు విచారణసందర్భంగా పరీక్షల రద్దుపై అఫిడవిట్ రెండు రోజుల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
అన్ని రాష్టాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితి నెలకొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్‌లో తెలపాలని సూచించింది. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్మాసనం పేర్కొంది. తాజాగా పరీక్షల రద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అసోం, పంజాబ్, త్రిపుర బోర్డులు సుప్రీంకోర్టు వెల్లడించాయి. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఇకనైనా ఏపీ సర్కార్ నిర్ణయం మార్చుకుంటుందో లేక పంతానికే పోతుందో చూడాలి మరీ..