ఈటల మీటింగ్ ఆడియో లీక్.. ! తమ్ముడే చేశాడా..?
posted on Jun 22, 2021 @ 8:19PM
తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుండటంతో అన్ని పార్టీలు నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. ఈటల రాజేందర్ గ్రామాల్లో పర్యటిస్తుండగా.. అధికార పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతానికి సైలెంటుగానే ఉన్న .. త్వరలోనే పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.
రాజకీయ సమీకరణలతో పాటు రోజుకో ట్విస్ట్ హుజురాబాద్ నియోజకవర్గంలో వెలుగు చూస్తోంది. ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో, ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియడం లేదు.ముఖ్యంగా ఈటల రాజేందర్ శిబిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే కొంత మంది సన్నిహితులు ఈటలకు దూరమయ్యారని తెలుస్తోంది. తాజాగా వెలుగులోనికి వచ్చిన మరో ఘటన ఈటలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోందని సమాచారం. ఇటీవల ఈటల సోదరుడు ఈటల భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈటల, నాయకుల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మంత్రివర్గం నుంచి తనను కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత.. ఈటల రాజేందర్ గత నెల మే 27న శామీర్ పేటలోని తన నివాసంలో కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, యువతతో సమావేశమయ్యారు. ఆ భేటీలో ఈటల స్థానిక మండలంలోని నాయకుల తీరును, రాజకీయ సమీకరణాలపై చర్చ చేస్తుండగా భేటీలో ఉన్న ఈటల సోదరుడు భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో ఆ భేటీకి సంబంధించిన మాటలను రికార్డు చేసినట్లు సమాచారం. అందులో మండల నాయకులు మాట్లాడిన మాటలు కూడా రికార్డయ్యాయి. అయితే, ఇటీవల ఆ వాయిస్ రికార్డు భద్రయ్య ఫోన్ నుంచి ‘ఈటల అండ’ అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయబడింది. ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి ఫార్వార్డ్ అయి వైరల్ గా మారింది. ఈటల రాజేందర్ మీటింగ్ ఆడియో లీక్ కావడం ఇప్పుడు రచ్చగా మారింది.
ఆడియోను ఎవరు లీక్ చేశారా.. కావాలనే లీక్ చేశారా లేక పొరపాటున జరిగిందా అన్న చర్చ ఈటల రాజేందర్ శిబిరంలో జరుగుతుందట. అసలు ఈ వాయిస్ రికార్డు ఈటల తమ్ముడు భద్రయ్య ఎందుకోసం రికార్డ్ చేయవలసి వచ్చింది అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఎవరికైనా పంపించడం కోసమే ఈటల తమ్ముడు భద్రత్త మీటింగులో నేతలు మాట్లాడిన మాటలనురికార్డ్ చేశారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈటల రాజేందర్ సీక్రెటుగా నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఆడియో లీక్ కావడం.. అది కూడా ఈటల తమ్ముడి ఫోన్ నుంచే బయటికి రావడం మరింత కలకలం రేపుతోంది. తాజా ఘటనతో ఈటల శిబిరంలో ఇంటి దొంగలు ఎక్కువగా ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆడియో లీక్ వైరల్ కావడంపై రాజేందర్ కూడా అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. చూడాలి మరీ ముందు ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందో..