స్కూళ్లు తెరిస్తే డేంజర్ అన్న నీతి ఆయోగ్.. ప్రాణాలంటే లెక్కలేని జగన్ సర్కార్!
posted on Jun 23, 2021 @ 9:48AM
కొవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడుప్పుడే తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. లాక్ డౌన్ ను క్రమంగా అన్ లాక్ చేస్తున్నాయి. విడతల వారీగా సడలింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నాయి. అందులో ఏపీ ప్రభుత్వం టాప్ లో ఉంది. ఏపీలో ప్రస్తుతం రోజుకు నాలుగు వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటి రేటు ఐదు శాతానికి పైగానే ఉంటోంది. పాజిటివిటి రేటు ఐదు శాతం ఉందంటే కొవిడ్ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లుగా భావించారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతోంది.
పరీక్షలు వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా.. నిపుణులు చెబుతున్నా , విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. పరీక్షలపై పంతానికి పోతోంది. నిజానికి దేశంలోని 21 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థులకు నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలో ఉన్న సీబీఎస్ఈ పదకొండు, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని ఎగ్జామ్స్ ను కూడా క్యాన్సిల్ చేసింది. ఏపీ సర్కార్ మాత్రం మొండి వైఖరితోనే ముందుకు వెళుతోంది. దీంతో విద్యార్థుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడుతుందనే ఆందోళం వ్యక్తమవుతోంది.
తాజాగా స్కూళ్లు తెరవడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని చెప్పారు . ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. 'పాఠశాల అంటే టీచర్, హెల్పర్, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల మనకు ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే అలా చేయడం మంచిది. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్ విజృంభించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైరస్ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈమేరకు ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంటుంది. ఇందులో రెండు మూడు మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి' అని వీకే పాల్ సూచించారుు.
బోర్డు పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరుపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణపై రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని ధర్మాసనం నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం, నీతి ఆయోగ్ సూచనలతోనైనా పరీక్షల నిర్వహణపై జగన్ రెడ్డి సర్కార్ పంతం వీడుతుందో లేదా చూడాలి మరీ..