కేసీఆర్ ట్రాప్‌లో జగన్!.. ఇంకా ఎదగాలి బాస్!
posted on Jun 22, 2021 @ 4:32PM
కేసీఆర్-జగన్. రెండేళ్ల క్రితం మంచి మిత్రులు. ఇప్పుడు వారి రిలేషన్‌పై సందేహాలు. స్నేహమా? వైరమా? అనే కన్ఫ్యూజన్. పరిస్థితులు అలా మారిపోయాయి మరి. ఆనాడు వాళ్లిద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. తాడేపల్లి ప్యాలేజ్‌లో విందుభోజనం చేశారు. నీటి చర్చల కోసం జగన్ ప్రగతి భవన్ విచ్చేశారు. కేసీఆర్ ఆతిథ్యం స్వీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలోనూ తళుక్కున మెరిశారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగానే.. వారి మధ్య మళ్లీ గ్యాప్ పెరిగినట్టే కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ఓ హాయ్ లేదు.. బాయ్ లేదు. ఓ ఫోన్ కాల్ లేదు.. ఓ మీటింగ్ లేదు.. ఆ ఇద్దరూ కలిసి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఒకే టేబుల్ మీద కలిసి భోజనం చేసి ఎన్నాళ్లైందో. అసలు ఏమై ఉంటుంది? వారి మధ్య ఏం జరిగుంటుంది? కేసీఆర్, జగన్‌ల దోస్తీ.. కుస్తీగా ఎందుకు మారింది? అంటే ఆసక్తికర కారణాలే కనిపిస్తున్నాయి.
అసలు కేసీఆర్.. జగన్‌తో ఏనాడూ దోస్తీ చేయనేలేదని.. స్నేహం ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాపం, రాజకీయ అనుభవం లేని జగన్.. కేసీఆర్ ట్రాప్‌లో చిక్కుకుపోయారని అంటున్నారు. అయితే, జగమొండి జగన్ అంతలోనే కేసీఆర్ దుర్బుద్ధి గ్రహించారని.. అందుకే పొరుగు రాష్ట్ర సీఎంకు దూరమయ్యారని చెబుతున్నారు. ఇప్పుడిక తానేంటో.. తన తఢాఖా ఏంటో కేసీఆర్‌కు రుచి చూపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే, నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను ఇరకాటంలో పడేసేలా.. పోతిరెడ్డిపాడు స్పీడు పెంచారని అంటున్నారు. ఇప్పుడు వారిద్దరి ఉద్దేశ్యం.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే... అన్నట్టుగానే ఉంది. కేసీఆర్‌కు, జగన్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే, స్నేహం ముసుగులు తీసేసి.. జల జగడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారని సమాచారం.
ఇక, జగన్‌ను కేసీఆర్ ట్రాప్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉందంటున్నారు. జగనే అమాయకంగా కేసీఆర్‌ను నమ్మారని చెబుతున్నారు. గతాన్ని తవ్వి.. అప్పట్లో అసలేం జరిగిందనేది విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్-జగన్. ఒకప్పుడు బద్ద శత్రువులు. ఉద్యమ సమయంలో జగన్‌ను రాళ్లతో తరిమిన వైరం. ఆ దెబ్బకి సమైక్యాంధ్రనే ముద్దంటూ ఏపీకి పారిపోయి వచ్చారు జగన్. కేసీఆర్ అండ్ కో లో విజయగర్వం. జగన్ మనసులో పరాభవ భారం. ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది. కాల చక్రం గిర్రున తిరిగింది. ఏళ్ల పాటు వారిద్దరి మధ్య వైరం మాత్రం అలానే ఉండిపోయింది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. వారిద్దరిని ఏకం చేసిన ఫలం మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. 2018లో అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లగా.. దొరను ఓడించేందుకు తెలంగాణలోని విపక్షాలన్నీ ఏకమయ్యాయి. అనూహ్య రాజకీయ పునరేకీకరణకు అది వేదికైంది. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. వారికి ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. రాహుల్‌గాంధీ, చంద్రబాబు, కోదండరాం, గద్దర్.. ఒకే డయాస్ పంచుకున్నారు. అదో సంచలనం.. అదో రాజకీయ అద్భుతం...
వారి కలయిక చూసి ఓ దశలో కేసీఆర్ సైతం దడుసుకున్నారు. అంతలోనే తేరుకొని.. చంద్రబాబు వస్తే మళ్లీ ఆంధ్ర పాలనంటూ దుమ్మెత్తిపోశాడు. బాబును దోషిగా చూపించి.. ఓట్లు దండుకున్నాడు. ఎన్నికల్లో గట్టేక్కాడు. గెలిచాక విజయగర్వంతో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సవాల్ చేశారు. అలా, ఏపీలో చంద్రబాబును దెబ్బ తీసేందుకు.. కేసీఆర్ బ్యాచ్ జగన్‌తో చేతులు కలిపింది. అంతేకానీ, జగన్‌పై ప్రేమ కాదు.. ఏపీపై మమకారం అంతకన్నా కాదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లోటస్‌పాండ్ వెళ్లి మరీ జగన్‌తో మంతనాలు జరిపారు. జగన్‌కి మద్దతు ప్రకటించారు. వైసీపీతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు.
చంద్రబాబు మీద కోపంతో ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి పరోక్షంగా ఫుల్ సపోర్ట్ చేశారంటారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను అడ్డుపెట్టుకొని.. టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేశారని బాధితులే స్వయంగా ప్రకటించడం అప్పట్లో కలకలం రేపింది. కేసీఆర్.. జగన్‌కు వెయ్యి కోట్ల డబ్బు పంపించారంటూ ప్రచార సమయంలో చంద్రబాబు ఆరోపించారు. అలా, కేసీఆర్, జగన్‌లు కలిసి చంద్రబాబును ఓడించారు.
జగన్ సీఎం అయ్యాక కూడా ఆ బంధం కొన్నాళ్ల పాటు కొనసాగింది. ఈసారి కేసీఆర్ కన్ను నీళ్లపై పడింది. కృష్ణా-గోదావరి అనుసంధానం అంటూ.. ఉమ్మడి ప్రాజెక్టులంటూ కహానీలు చెప్పారు. అనుభవరాహిత్యంతో జగన్ వాటిని నమ్మారు. కేసీఆర్ ఇచ్చిన విందు భోజనం అరిగాక.. తాడేపల్లి తిరిగొచ్చాక.. తీరిగ్గా ఆలోచిస్తే తెలిసొచ్చింది.. అది అసాధ్యమని. అందులో ఉమ్మడి ప్రయోజనాలకంటే తెలంగాణకు లాభమే ఎక్కువగా ఉందనే తత్వం అధికారులు చెప్పాక ఆలస్యంగా జగన్‌కు బోధపడింది. కేసీఆర్‌పై మాయల మరాఠీ అనే ముద్ర ఉంది. తెలంగాణ ప్రజలే ఆయన్ను ఓ పట్టాన నమ్మరు. అలాంటిది.. జగన్‌రెడ్డి మాత్రం తగదునమ్మా అంటూ ఎగేసుకుపోయి.. నీళ్లలో నిండా మునిగి వచ్చారు. వెంటనే కాదంటే ఎక్కడ తన పరువు పోతుందోనని భావించి.. కొన్నాళ్ల పాటు మౌనంగా వేచిచూసి.. ఇప్పుడిక మా నీళ్లు.. మా ప్రాజెక్టులంటూ కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు జగన్. ఈ పని చంద్రబాబు ఎప్పుడో చేశారు. కేసీఆర్ గురించి చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే.. ఏపీ వాటాను దోచుకోవాలనే తెలంగాణ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వచ్చారు. చంద్రబాబు ఉంటే.. కృష్ణా వాటర్‌లో తమ పప్పులు ఉడకవనే అక్కసుతోనే.. జగన్‌కు ఫ్రెండ్‌షిప్ బిస్కెట్ వేసి.. నీటి వాటాలో లాభం పొందాలని చూశారు. ఆ విషయం ఇంతకాలానికి జగన్‌కు తెలిసొచ్చింది. తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైంది.