ఘనంగా బోనాలు.. మరి, ప్రాణాలు? కేసీఆర్ జర సోచో...
posted on Jun 22, 2021 @ 1:26PM
అమ్మ బైలెల్లితే.. అంతా భక్తి పారవశ్యమే. ఆషాఢంలో బోనాల జాతర. తెలంగాణకే ప్రత్యేకత. హైదరాబాద్‌లో బోనాల పండుగ మరింత హైలైట్. తల్లికి బోనం సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బోనమెత్తి.. మొక్కులు చెల్లించుకుంటారు. కాలికి గజ్జకట్టి.. శివశక్తులు ఆడిపాడతారు. పులివేషాలు,. అమ్మవారి పూనకాలు.. పోతురాజుల డ్యాన్సులు.. అబ్బో.. ఆ హంగామే వేరు. భాగ్యనగరంలో బోనాల జాతర చూసి తీరాల్సిందే.
ఏటేటా ఘనంగా జరిగే బోనాల జాతర కరోనా కారణంగా గతేడాది సాదాసీదాగా జరిగింది. కొవిడ్ ఆంక్షలతో, భక్తుల నియంత్రణతో బోనాలు బోసిపోయాయి. ఈసారి మళ్లీ ఘనంగా బోనాల జాతర నిర్వహణకు సర్కారు సిద్దమవుతోంది. బోనాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు 15కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. బోనాల ఏర్పాట్లపై ఈ నెల 25న మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.
ఈ ఏడాది జులై 11న గోల్కొండ బోనాలతో జంట నగరాల్లో సందడి షురూ కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. 26న ఏనుగుపై ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 1న హైదరాబాద్ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
సన్నాహక ఏర్పాట్లు చూస్తుంటే.. కుంభమేళా స్థాయిలో బోనాల జాతర జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సంతోషమే. అమ్మకు బోనం ఈ స్థాయిలో జరగడం ఆనందమే. కాకపోతే ఇదంతా మామూలు పరిస్థితుల్లో జరిగుంటే అంతా వంద శాతం ఆహ్వానించే వారే. కానీ, ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ఘనంగా బోనాలు జరగనుండటమే ఆందోళనకరం అంటున్నారు.
కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్‌లాక్ మొదలైపోయింది. తెలంగాణలోనూ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఏదీ లేదు. అయితే, అన్‌లాక్ సడలింపులకు తొందర వద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అయితే, ఆరోగ్యం కంటే ఆకలి బాధ దారుణమంటూ తెలంగాణ సర్కారు లాక్‌డౌన్‌ను కంప్లీట్‌గా ఎత్తేసింది. అక్టోబర్ వరకూ కరోనా రాదంటూ సీఎం కేసీఆర్ జోస్యం కూడా చెప్పేశారు. ఇక కరోనా పోయింది.. ఇప్పట్లో మళ్లీ రాదంటూ.. సర్కారు ఫిక్స్ అయిపోయింది. అందుకే, జులై-ఆగస్టులో బోనాల జాతర ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఎలా ఉన్నా.. కరోనా పోయిందంటే.. మళ్లీ రాదంటే.. నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. కొవిడ్ భయం ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నా.. ఇంకా మొదటి డోసు పావు మందికి కూడా పూర్తి కాలేదంటున్నారు. అంటే, కొవిడ్ నుంచి పూర్తి రక్షణకు ఇంకా టైమ్ పడుతుందన్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో బోనాలు నిర్వహిస్తే......?
బోనాలంటే జనజాతర. భక్తులు తండోపతండాలుగా వస్తారు. అమ్మకు బోనం సమర్పించేందుకు భారీగా క్యూ కడతారు. గుడి చుట్టూ కిలోమీటర్ల దూరం జనసందోహమే. మరి, ప్రజలు వేలాదిగా ఒకేచోట చేరితే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అది కొవిడ్ హాట్ స్పాట్‌గా మారకుండా ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన కుంభమేళాలో అలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అసలే, ఆగస్టు-అక్టోబర్ మధ్యలో థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలు ఓవైపు.. మూడో ముప్పు దారుణంగా ఉంటుందనే భయాందోళనలు మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడిప్పుడే కొవిడ్ కేసులు కంట్రోల్‌లోకి వస్తున్న సమయంలో.. బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని జాగ్రత్తలు చెబుతున్నారు వైద్యనిపుణులు.