ఓయూ విద్యార్థి నేతపై హత్యాయత్నం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం..?
posted on Jun 23, 2021 9:13AM
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఉస్మానియా యూనివర్శిటి విద్యార్థి నాయకుడు జటంగి సురేష్ యాదవ్ పై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. సుర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆతనిపై మంగళవారం రాత్రి అగంతకులు దాడి చేశారు. పిడుగుద్దులు గుద్దారు. దుండుగుల దాడిలో సురేష్ యాదవ్ కు తీవ్ర గాయలయ్యాయి. అక్కడే పడిపోయిన సురేష్ ను అతని అనుచరులు సుర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం సురేష్ సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్(సురేష్ స్వస్థలం)లో 20మంది టీఆర్ఎస్ నాయకులు.. తనను చంపేందుకు ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.. ఆధారాలు చూపిస్తున్నాడు. ఈ సంఘటనలో తనతో పాటు అడ్డొచ్చిన సోదరుడు మహేష్, గ్రామస్తులకు తీవ్రంగా గాయాలు అయినట్టు చెబుతున్నాడు.పాతర్ల పహాడ్ గ్రామంలో జరుగుతున్న జాతరను చూసేందుకు వస్తే.. పథకం వేసి టీఆర్ఎస్ నాయకులు తనపై దాడి చేశారన్నాడు. ఈ దాడిలో నూతన్‌కల్ ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ కనగంటి వెంకన్నతో సహా మరో 20 మంది ఉన్నట్టు తెలిపాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ డైరెక్షన్ లోనే సురేష్ యాదవ్ పై దాడి జరిగిందని.. అతని అనుచరులు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారంతా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు.
ఓయూ విద్యార్థి నాయకుడు జటంగి సురేష్ యాదవ్‌పై అధికార పార్టీ నాయకుల దాడి సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో ఓయూలోనూ ఓసారి సురేష్ యాదవ్ పై దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్న కారణంతో బాల్క సుమన్ అనుచరులు దాడి చేసినట్టు అప్పుడు సురేష్ మీడియా ముందు ఆరోపించారు.తాజాగా మరోసారి అతనిపై దాడి జరగడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజులుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సురేష్ యాదవ్. తెలంగాణ విద్యార్థి పరిషత్ లోనూ కీలక నేతగా ఉన్న సురేష్ యాదవ్.. బీజేపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈటల వెంట ఢిల్లీకి వెళ్లిన బృందంలో సురేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఈటలకు మద్దతుగా ఇటీవల కాలంలో ఓయూ జేఏసీ పేరుతో ప్రెస్ మీట్లు పెడుతూ కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సురేష్. సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిపైనా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి దగ్గరగా ఉండే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రోదల్బంతోనే సురేష్ యాదవ్ పై దాడి జరిగిందని.. అతని అనుచరులు ఆరోపిస్తున్నారు.
జటంగి సురేష్ యాదవ్‌కు ఈటల రాజేందర్ ఫోన్ చేసి పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం జటంగి సురేష్.. ఈటల రాజేందర్, జర్నలిస్టు రఘును కలిసి వారికి మద్దతు తెలిపాడు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై దాడి సంచలనం రేపుతోంది.బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు.