వసతులు లేకుండానే ప్రారంభోత్సవాలా! కలెక్టరేట్ల పేరుతో కేసీఆర్ షో చేస్తున్నారా..?
posted on Jun 22, 2021 @ 3:44PM
తెలంగాణ ముఖ్యమంత్రిని ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి అంటూ విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. గత రెండున్నర ఏండ్లుగా ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్ లో ఉండటం తప్ప ప్రజల్లోకి కేసీఆర్ రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే జనాగ్రహం తెలిసొచ్చిందో... ఈటల రాజేందర్ భయమో తెలియదు కాని.. సడెన్ గా రూటు మార్చారు కేసీఆర్. జిల్లాల పర్యటనలతో ప్రజల్లోకి వెళుతున్నారు. రోజంతా జిల్లాల్లోనే గడుపుతున్నారు. కేసీఆర్ లో ఒక్కసారిగా వచ్చిన మార్పును చూసి రాజకీయ వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ జనాల్లోకి వెళ్లడం బాగానే ఉన్నా... అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆయన చేస్తున్న హడావుడిపైనే విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తి కాకుండానే ప్రారంభిస్తూ.. సీఎం షో చేస్తున్నారనే ఆరోపణలను విపక్షాలు చేస్తున్నాయి.
ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్.. కొత్తగా కట్టిన సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించారు. ఆదివారం వరంగల్ లో నిర్మించిన కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవనాల ప్రారంభం తర్వాత జరిగిన సభల్లో సుదీర్ఘంగా ప్రసగించారు కేసీఆర్. అద్బుతమైన భవనాలు కట్టుకున్నామని చెప్పారు. కాని బయటి నుంచి చూస్తే గొప్పగా కనిపిస్తున్న కొత్త కలెక్టరేట్ల లోపల మాత్రం అంతా ఖాళీగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. భవనాలైతే కట్టారు కాని మౌలిక వసతుల కల్పన మాత్రం ఇంకా జరగలేదట. ముఖ్యంగా కలెక్టరేట్ లో ఉన్నతాధికారులకు ప్రత్యేక చాంబర్లు, శాఖల వారీగా ప్రత్యేక గదులు నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదట. ఉద్యోగుల కోసం పార్టిషన్ చేయాల్సి ఉంటుంది. ఆ పనులు కూడా మొదలే కాలేదట. ఫర్నీచర్ గురించి చెప్పుకోవడానికి అక్కడ ఏమి లేదంటున్నారు. టాయిలెట్ గదుల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. ఉద్యోగులు పని చేయడానికి వీలుగా ఉండే పార్టిషన్ పనులతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు కూడా జరగలేదంటున్నారు.
నిజానికి నాలుగేండ్ల క్రితం కలెక్టరేట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. మొదటి టర్మ్ పాలన పూర్తయ్యేనాటికే సిద్దం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెండోసారి అధికారం చేపట్టి రెండున్నర ఏండ్లు పూర్తైనా భవనాలను పూర్తి చేయలేకపోయారు. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ అర్బన్ లో భవంతుల వరకు పూర్తి కావడంతో.. వాటినే ప్రారంభించారు కేసీఆర్. చాలా జిల్లాల్లో సగం పనులు కూడా జరగలేదంటున్నారు. కలెక్టరేట్ లో ఇంటీరియల్ వర్క్, పార్టిషన్ పనులే కీలకం అంటున్నారు. అవి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. అయినా కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టే.. మీడియాను కొత్త కలెక్టరేట్లలోకి అనుమతి ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కేసీఆర్ సర్కార్ తలపెట్టిన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు మొదటి నుంచి వివాదాస్పదమయ్యాయి. కలెక్టరేట్ల పేరుతో టీఆర్ఎస్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ దందాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ముందుగానే అక్కడ భూములు కొని.. తర్వాత తమ భూముల పక్కనే కలెక్టరేట్ నిర్మాణం జరిగేలా గులాబీ లీడర్లు స్కెచ్ వేశారనే ప్రచారం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఆరోపణలతోనే కొందరు కోర్టుకు వెళ్లడంతో చాలా కాలం పాటు అక్కడ పనులు నిలిచిపోయాయి. తమ స్వార్థం కోసం కొందరు నేతలు జనాలకు అందుబాటులో లేకుండా ఉండే ప్రాంతాల్లో, ఎక్కడో మూలన కలెక్టరేట్ల నిర్మాణాలు చేప్టటారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వచ్చాయి. జిల్లా ప్రజలందరూ ఈజీగా చేరుకునేలా ఉండే ప్రాంతంలో కాకుండా తమకు కాసులు కురిపించేలా ఉన్న స్థానంలో కలెక్టరేట్ల నిర్మాణం జరిగిందని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.