జగన్‌రెడ్డిపై డైరెక్ట్ అటాక్.. జూన్ 29న డేట్ ఫిక్స్..
posted on Jun 22, 2021 @ 7:17PM
చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఇక తగ్గేదే లే అంటూ ప్రజాపోరాటానికి పిలుపిచ్చారు. అందుకు జూన్ 29న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజున ఏపీలోని 175 నియోజకవర్గాల్లో.. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన టీడీపీ ఆందోళనకు దిగనుంది. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ పోరాటాలతో ప్రజల్లో చైతన్యం రగిలించిన చంద్రబాబు.. ఈసారి కేడర్‌ను ప్రజాక్షేత్రంలో ఉద్యమ కార్యచరణకు సిద్ధం చేస్తున్నారు. జగన్‌రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు చంద్రబాబు. వారం రోజులు టీకాలు వేయకుండా ఆపేసి.. ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కలకంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు.
జాబ్ కేలండర్‌నూ టీడీపీ అధినేత దుయ్యబట్టారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకుంటే... ఏపీలో మాత్రం అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్రా జ్యమేలుతున్నాయని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఇంటి సమీపంలోనే యువతిపై దారుణ అత్యాచారం జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రమం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.
ఏపీలో చేయూత పేరుతో మోసం జరుగుతోందని.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున కోత విధించారన్నారు. చేయూతను 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లింపు జరుగుతోందని, ఇలా ఒక్కో మహిళకు రూ.లక్షా 5వేలు ఎగనామం పెట్టి వంచించారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు చంద్రబాబు. సంక్షేమం పేరుతో ఏపీ సీఎం ప్రజలను మోసగిస్తున్నారని.. ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చింది గోరంత.. దోచింది కొండంత అని టీడీపి ఆధినేత విమర్శించారు. ఇక, వ్యవసాయం పరిస్థితి చూస్తే రైతులకు ఏపీ సర్కారు ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు మండిపడ్డారు.
ఇలా ప్రజా సమస్యలన్నిటిపై నిరసన తెలిపేలా.. జగన్‌రెడ్డి అరాచక పాలనను నిలదీసేలా.. జూన్ 29న.. 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాలని పిలుపిచ్చారు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. ముందుముందు సీఎం జగన్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా జరగబోయే ప్రజా ఉద్యమాలకు ఈ నిరసన కార్యక్రమంతో అంకురార్పణ జరగనుంది.