పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్ 124A ! చట్టం అమలుపై సుప్రీం సంచలనం..
posted on Jul 15, 2021 @ 12:30PM
రాజద్రోహం కింద పెడుతున్న కేసులపై దేశ వ్యాప్తంగా కొంత కాలంగా చర్చ జరుగుతోంది. సెక్షన్ 124-A అవసరమా అన్న ప్రశ్నలు కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. సెక్షన్ 124-A దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేసే సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని చెప్పారు.
సెక్షన్ 124-ఏ చట్టాన్ని సవాలు చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్(రిటైర్డు) ఎన్.జి. వోంబట్కెరే పిటిషన్ దాఖలు చేశారు.సెక్షన్ 124-A చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టం.. స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు ఈ చట్టం తీసుకొచ్చారు.. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారని చెప్పారు. ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది.. ఇప్పుడు కూడా దేశద్రోహం చట్టం అవసరమా అని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.
రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ‘‘స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంది. పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉంది. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోందని అని అన్నారు.
‘‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవెన్ని? సెక్షన్ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. బెయిల్ రాకుండా కక్ష సాధింపు, అధికారదాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు’’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. రాజద్రోహం సెక్షన్ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రాన్ని సూచించింది. ఈ సెక్షన్ రాజ్యంగా చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని దేశ అత్యుతున్న న్యాయస్థానం వెల్లడించింది.