భరత్ అనే అతను.. మహా నాయకుడు.. ఓయ్ నిన్నే...
posted on Jul 15, 2021 @ 11:19AM
బురదలో రాయి వేస్తే ఏమవుతుంది? బురద చిల్లి మన బట్టలే పాడవుతాయి. నోరు ఉన్నోడి జోలికొస్తే ఏమవుతుంది? మన బండారమంతా బట్టబయలవుతుంది? అదే, రఘురామ లాంటి పవర్‌హౌజ్‌ను టచ్ చేస్తే ఏమవుతుంది? ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. డౌట్ ఉంటే.. సీఎం జగన్‌రెడ్డిని అడగండి తెలుస్తుంది.. ఎంపి రఘురామతో పెట్టుకుంటే మనశ్శాంతి లేకుండా ఎలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో. వైసీపీ అధినేత జగనే రఘురామతో పెట్టుకొని.. లాక్కోలేక, పీక్కోలోక తెగ ఇదైపోతున్నారు. అలాంటిది.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మరే పనిలేనట్టు అనవసరంగా రఘురామను కెలికాడు. ఇక అంతే.. ఢిల్లీలో మీడియా సమావేశంపెట్టి మరీ భరత్‌ను పరువంతా తీసేశారు రఘురామకృష్ణరాజు.
తనపై అనర్హత వేటు వేసేలా పావులు కదుపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడుతుంది.. నర్సాపురం నియోజకవర్గ సమస్యలు సీఎం జగన్ నన్ను చూసుకోమన్నారు’ అని భరత్ వ్యాఖ్యానించడంపై రఘురామ స్పందించారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాలను కూడా తమ పార్టీ నాయకులే తీసుకుంటున్నట్లు తనకు తెలియదని ఎద్దేవా చేశారు.
‘భరత్‌ను స్వాగతిస్తున్నా. ఆయన ఓ సినిమాలో నటించారు. అయితే ప్రజలు దాన్ని చూడకపోవడంతో ప్లాప్ అయింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు ఓ మహా నాయకుడిని కోల్పోయేవారు. రాజమండ్రిలో ప్రజలు నివసించేందుకు ఆవ భూమిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి మనసు దోచిన ఆయన అనేక నియోజకవర్గాలకు ఎదగాలని ఆశిస్తున్నా’ అంటూ సెటైర్లు వేశారు రఘురామ.
తనపై అనర్హత అంశంలో లోక్‌సభను స్తంభింపజేస్తామని ప్రగల్భాలు పలికే వారు ఆ విద్యను ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్‌పై ఎందుకు వినియోగించడం లేదని రఘురామ ప్రశ్నించారు. మీ కేసుల విచారణ 11 ఏళ్లుగా జరుగుతుంటే నా కేసుల విచారణ వెంటనే జరగాలని కోరడమేంటని ప్రశ్నించారు. తన అనర్హతపై వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయని, తన ఆశయం నెరవేరుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు.
ఎంపీ భరత్‌పై రఘురామ వేసిన సెటైర్లపై రాజమండ్రిలో తెగ చర్చించుకుంటున్నారు. నిండా నీటితో ఉండే ఆవ భూమిని.. ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేసుకొని చీదరించుకుంటున్నారు. సినిమాల్లో వేసిన డ్రామాలే.. రాజకీయాల్లోనూ వేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంతకీ, ఎంపీ భరత్ హీరోగా నటించిన సినిమా పేరు తెలుసా..? ఓయ్ నిన్నే....