పంజాబ్ లో సంధి కుదిరింది.. కెప్టెన్ తో కలిసి సిద్దూ గేమ్
posted on Jul 15, 2021 @ 3:28PM
పంజాబ్ లో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విద్యుత్ చార్జీల విషయం మినహా మరే విధంగానూ పెద్దగా ప్రజావ్యతిరేకత లేదు. మరో వంక, అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రతిపక్షం, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ విడిపోవడంతో మరింత బలహీన పడింది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు గెలుచుకుని, ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నా, అది అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్’ను పంజాబీలు సొంత పార్టీగా చూడడం లేదు..ఢిల్లీ పార్టీగానే భావిస్తున్నారు. అందుకే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, అన్ని రంగాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దానంతో పాటు, సిక్కునే సీఎం చేస్తామన్న వాగ్దానం కూడా చేశారు. అయినా,ఆప్’ అధికార పగ్గాలు చేపట్టడం కష్టమే అని పరిశీలకులు భావిస్తున్నారు.
మరో వంక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేక రైతాంగం సుదీర్ఘకాలంగా సాగిస్తున ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులు రైతుల ఆందోళనకు బహిరంగం మద్దతు తెలవడమే కాకుండా ప్రత్యక్షంగా ఉధయ్మలో పాల్గొన్నారు. పార్లమెంట్’లోనూ ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే విషయంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రుజువైంది. ఆరుకు ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ స్వీప్ చేసింది.
అయితే, అన్నీ ఉన్నా , కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విబేధాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంచుమించుగా గత మూడు సంవత్సరాలకు పైగా, ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ మంత్రి నజ్యోతి సింగ్ సిద్దూ వర్గాల మధ్య ఓ మోస్తరు యుద్ధం సాగుతూనే వుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యుద్దం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ గెలుపు మీద అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. ఇరు వర్గాల మధ్య సంధి కుదిరింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ఎవరి స్థాయిలో వారు, అటు అమరేంద్ర సింగ్’తో ఇటు సిద్దూతో చర్చలు జరిపారు. ఇద్దిరి మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ కొనసాగుతారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమిస్తారు. ఈమేరకు ఇద్దరు నేతలు అంగీకరించారని, పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ హరీష్ రావత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచరం.
ఈ ఇద్దరికీ తోడుగా మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని తెసుస్తోంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అమరీందర్ చెప్పినట్లు హరీస్ రావత్ వెల్లడించారు. సిద్ధూ ఈ రాష్ట్ర భవిష్యత్తు అని, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలని కూడా రావత్ చెప్పడం గమనార్హం. అయితే, బుధవారం సిద్దూ, ఆప్’ కు అనుకూలంగా ట్వీట్ చేసిన నేపద్యంలో అధిష్టానం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. ఇప్పటికైనా ఇద్దరు విబేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.