ఆ కలెక్టర్ ఓ దేవుడు
posted on Jul 15, 2021 @ 11:08AM
ఇది చదువుతుంటే, లేదా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అవునా, ఇది నిజామా, కల కాదు కదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ, ఇది నిజం. మానవత్వం, మనిషితనం ఇంకా బతికే ఉన్నాయి. బతికించే అధికారులూ ఉన్నారన్న విశ్వాసం మిగిల్చే ఓ కలెక్టర్’ కథ.
అధికార దర్పం ఎలా ఉంటుందో, అధికారాలను సామాన్యులు కలవడం ఎంత కష్టమో అందరికీ ఎదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అందులోనూ నిత్యం తమ విధులతో అష్టావధానం, శతావధానం చేసే కలెక్టర్ స్థాయి అధికారిని కలవడం ఎంత కష్టమో వేరే చెప్పనక్కర లేదు. అలాంటిది కల్లెక్టరే వచ్చి, ఓ పేదరాశి పెద్దమ్మ ఇంటి తలుపు తడితే ... అదే జరిగింది. నిజానికి ఇది ఊహకు కూడ అందని నిజం. అయితే, అది మన తెలుగు రాష్ట్రాలలో కాదు, మన పొరుగున ఉన్న తమిళ నాడులో,అలాగని తెలుగు రాష్ట్రలలో అలాంటి ఉత్తములు లేరని కాదు.
ఇక విషయంలోకి వస్తే ... అది తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామం.. ఆ గ్రామంలో ఓ పూరి గుడిసె... ఆ గుడిసెలో నా అనే వారు ఎవరూ లేని ఓ 80 సంవత్సరాల వృద్దురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఇరుగు పొరుగు వారికి కూడా ఆ అవ్వను పట్టించుకే స్థోమత లేదో . మనసే లేదో గానీ, ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అలా ఒంటరిగా దేవుని తోడుగా జీవిస్తోంది.
ఆ విషయం ఎలా తెలిసిందో గానీ ఆ జిల్లా కలెక్టర్’కి తెలిసింది. ఆమెకు సంబందించిన సమాచారం తెప్పించున్నారు. ప్రభుత్వ సహాయానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించారు. ఆయన తమ కుర్చీలోంచి కదలకుండా ఆ అవ్వకు సహయం చేయవచ్చును. కానీ, ఆయన అలా చేయలేదు, స్వయంగా ఆయనే, ఆమె గుడిసెకు వెళ్లి, ప్రేమగా పలకరించారు, ఆమెతో కలిసి భిజనం చేశారు. నీకు అండగా నేనున్నాను, అనే భరోసా ఇచ్చారు.
వివరాలోకి వెళితే ... ఒక రోజు కలెక్టర్ తమ ఇంటినుంచి భోజనం క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టి లోపలకు రావచ్చా ... అని అడగారు ... ఆ వచ్చిన వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు. ఇంతలోనే కలెక్టర్ లోపలకు వెళ్లి ... అయ్యో కుర్చీకూడా లేదే అని అవ్వ అనేలోపలే కింద కూర్చున్నారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. తనతో కలిసి భోజనం చేయమని కోరారు. ఆమె అవాక్కయ్యారు. కలెక్టర్ తెచ్చిన క్యారియర్ విప్పి ఆమెతో కలిసి భోజనం చేశారు. వెళుతూ వెళుతూ ఆమె చేతిలో ఒక కవర్ ఉంచారు. అసలు ఏమి జరుగుతుందో, ఆ కవర్’లో ఏముందో ఆమెకు అర్థం కాలేదు. అలాగే బయట గుమిగూడిన జనాలకు కూడా .. . అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు,వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. వెళుతూ ఆ కలెక్టర్ ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకుని ‘అవ్వా ... నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదు.. డబ్బులు నీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేశాను’ అన్నారు. ఆ అవ్వ కళ్ళ నిండా ఆనందభాష్పాలతో… ఆ అధికారికి చేతులెత్తి నమస్కరించింది. ఆ అవ్వ ఒక్కరే కాదు, మనం అందరం కూడా ఆ కలెక్టర్ కు ... లంటి ఎందఱో మహానుభావులకు చేతులెత్తి దండం పెట్టొచ్చు.