పీకే డైరెక్షన్ లో రాహుల్ చిత్రం.. ‘లోక్ సభలో లీడర్’
posted on Jul 14, 2021 @ 6:28PM
ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల రాజకీయం ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. ఆ వ్యక్తి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ కిశోర్ ఎవరు ఏమిటి, అనే పరిచయాలు అక్కరలేదు. ఆయన మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతో సమావేశ మయ్యారు.అంతకు ముందే విడిగా సోనియా గాంధీతోనూ సమావేస మయ్యారు. ఇక అక్కడ నుంచి ఉహాగానాలు వరద ప్రవాహం మొదలలైంది. అనేక ఊహాగానాలు కొట్టుకొస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే పుకారు మొదలు, కిశోర్ డైరెక్షన్’ లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్ట్ చేసేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారనే వరకు అనేక వ్యూహాగానాలు ఢిల్లీ వీధుల్లో షికారు చేస్తున్నాయి.ఈ రెండు వ్యూహాగానాలు కూడా నిజమే అయినా అవ్వవచ్చుని, అయితే, ఏది ముందు ఏది వెనక అనే విషయంలో కొంత అస్పష్టత ఉందని వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నరాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి అయితే, రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు చేపట్టడం ఖరరైనట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఆ పదవిలో ఉన్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాల సమాచారం. రాహుల్ గాంధీని 2024 ఎన్నికలలో విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా మోడికి ఎదురు నిలపాలనే వ్యూహంతో పావులు కదుపుతూ వస్తున్న ప్రశాంత్ కిశోర్, ఆ వ్యూహంలో భాగంగానే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారని అందుకు రాహుల్ అంగీకరించారని సమచారం. జులై నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కొవిడ్ విషవలయంలో చిక్కుకుని బలహీనంగా మారింది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతగా నిలబడితే, ఆయన ఇమేజి పెరుగుతుందని ప్రశాంత్ కిశోర్’ పక్క ప్రణాళికతో రాహుల్ గాంధీని ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ పార్టీలో చేరటం విషయానికి వస్తే, అందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అంటున్నారు. అలాగే, ఎన్నికలకు ముందా తర్వాత అనే విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. అదీ కాక, గతంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ) పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన పీకే.. కొంత కాలానికే ఆ పార్టీ నుంచి వైదొలగారు. అలాగే, బెంగాల్ గెలుపు తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నానని, ఇక వేరే ఫీల్డ్ లో పనిచేస్తానని చెప్పిన సందర్భంలోనే, రాజకీయాలు తన వంటికి పడవని ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయనని కూడా ప్రకటించారు. అఫ్కోర్స్, రాజకీయ నాయకులే మాట మీద నిలబదనప్పుడు, ఆ రాజకీయ నాయకులను తోలుబొమ్మల్లా ఆడిస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటమీద నిలబడవలసిన అవసరం ఉంటుందా ..ఉండదు కదా