పొలిటికల్ ఫ్లైట్.. సంథింగ్ స్పెషల్..
posted on Jul 15, 2021 @ 1:39PM
రాజకీయ నాయకులను జనాలు తెగ తిడుతుంటారు. అవినీతి, అరాచకాలపై మండిపడుతుంటారు. పెద్దగా చదువుకోని వారే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయమూ ఉంది. అయితే.. అంతా అలా ఉండరు. కొందరు దోపిడీ దారులు, అరాచక శక్తులు రాజకీయాల్లో, అధికారంలో ఉన్న మాట వాస్తవమే అయినా.. అనేక మంది మంచివారు, ఉన్నత చదువులు చదివిన వారు, అనేక నైపుణ్యాలు కలిగిన వారూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు.
వారిద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు. ఒకరు బీజేపీ ఎంపీ, మరొకరు డీఎంకే ఎంపీ. పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీలో ఆ ఇద్దరూ సభ్యులు. కమిటీ భేటీ జరిగితే పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు. భేటీలో ఇద్దరూ ఒక అంశంపై తీవ్రంగా వాదించుకున్నారు. భేటీ ముగిసింది.. ఎవరికి వారు వెళ్లిపోయారు. అందులో ఒకరు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. కమిటీ భేటీ తరువాత ఆయన ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు. అంతలోనే.. విమానం పైలట్ ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు. ‘మీరు కూడా ఇదే విమానంలో వస్తున్నారా?’ అని అడిగారు. పైలట్ మాస్కు ధరించి ఉండడంతో ఎంపీ దయానిధి మారన్ ఆ పైలట్‌ను సరిగా గుర్తించలేకపోయారు.
పైలట్ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించడంతో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ విషయం గమనించిన పైలట్.. ‘మీరు నన్ను గుర్తించలేకపోయారు కదా?’ అంటూ చిరునవ్వులు చిందించారు. అప్పుడర్థమైంది ఎంపీ దయానిధి మారన్‌కు.. ఆ పైలట్ మరెవరో కాదు.. తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అని. అంతేకాదు కొద్దిగంటల ముందు పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీలో వాదన జరిగింది కూడా ఈ ఇద్దరు ఎంపీల మధ్యే. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని పైలట్‌గా చూసి దయానిధి మారన్ ఆశ్చర్యపోయారు. అంతకన్నా ఎక్కువ ఆనందించారు. తనకు ఎదురైన ఈ అపూర్వ అనుభవాన్ని మారన్.. ‘ఎ ఫ్లైట్ టు రిమెంబర్’ శీర్షికతో ట్వీట్ చేశారు. పైలట్ దుస్తుల్లో ఉన్న రాజీవ్ ప్రతాప్ రూడీ ఫొటోను కూడా పెట్టారు. ఆ రోజు ఆయన తమను దిల్లీ నుంచి చెన్నైకి క్షేమంగా చేర్చారంటూ.. ‘థాంక్ యూ కెప్టెన్’ అని కృతజ్ఞతలు తెలిపారు.
జులై 13న ఢిల్లీ నుంచి చెన్నైకి విమానం నడిపిన రూడీ ఆ రోజు చెన్నైలో ట్రావెల్, సివిల్ ఏవియేషన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అది పూర్తయిన తరువాత ఆ మరుసటి రోజు గురువారం చెన్నై నుంచి కేరళలోని కోచీకి విమానం నడిపారు. కమిటీ సమావేశంలో పాల్గొన్న 20 మంది ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ నడిపిన విమానంలోనే ప్రయాణించారు. వీరితో పాటు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తదితరులు కూడా రూడీ నడిపిన విమానంలో ప్రయాణించారు.
రాజీవ్ ప్రతాప్ రూడీ బిహార్‌లోని చాప్రా నియోజకవర్గ ఎంపీ. బీజీపీకి చెందిన ఆయన గతంలో కేంద్రంలో సివిల్ ఏవియేషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీకి ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అయితే, ఆయన ఏ సంస్థలోనూ పైలట్‌గా పనిచేయడంలేదు, జీతం తీసుకోవడం లేదు. కానీ, గౌరవ పైలట్‌గా అప్పుడప్పుడూ కొన్ని సంస్థలకు చెందిన విమానాలను నడుపుతుంటారు. రూడీ.. అనేక విద్యాసంస్థలలో ఎకనమిక్స్ పాఠాలు కూడా చెబుతారు. 50 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన ఆయన ‘‘ఎయిర్ బస్ 320, ఎయిర్ బస్ 321 వంటి భారీ జెట్‌లు నడిపే పార్లమెంటేరియన్ ప్రపంచంలో నేను తప్ప వేరేవారు లేరేమో’’ అంటారు రూడీ. ఎంతైనా.. రూడీ రూటే సెపరేటు అన్నట్టు ఉందికదా.