రంగంలోకి బిగ్‌బాస్.. అమిత్‌షా టేబుల్‌పై హుజురాబాద్ రిపోర్ట్..
posted on Jul 14, 2021 @ 9:27PM
హుజురాబాద్ ఉప ఎన్నిక. టీఆర్ఎస్‌కు ఎంత ముఖ్యమో.. బీజేపీకీ అంతే కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన స్థానం. ఏమాత్రం కాంప్రమైజ్ కాలేని పరిస్థితి. గెలిస్తేనే.. నిలిచేది. ఓడితే.. ట్రయాంగిల్ రేస్‌లో చాలా డ్యామేజ్ జరిగిపోద్ది. అందుకే, సర్వశక్తులూ ఒడ్డుతోంది కమలదళం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సైతం హైదరాబాద్ నుంచి హుజురాబాద్‌కు పాదయాత్ర చేపట్టనున్నారు. ఇలా.. కమలనాథులంతా కలిసి ఒక్క హుజురాబాద్ కోసం గట్టి పోరాటమే చేస్తున్నారు. తాజాగా, రాష్ట్ర నేతలకు జాతీయ దళపతి తోడయ్యారు. హుజురాబాద్ కోసం తానుసైతమంటూ ముందుకొచ్చారు. ఒక్కసారి.. రెండుసార్లు కాదు.. తెలంగాణ కోసం తాను ఎన్నిసార్లైనా రాష్ట్రానికి వస్తానని.. హుజురాబాద్‌లోనూ పర్యటిస్తానంటూ కమలోత్సాహం నింపారు.
హుజురాబాద్. ఈటల ఇలాఖా. ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే. ఇప్పుడు సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌గానే పోరు ఉంటుందని భావించారు. ఈటల రాజేందర్ తన గెలుపు చాలా ఈజీ అనుకున్నారు. తాజాగా, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో బలాబలాలు తారుమారు అవుతున్నాయి. ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలీకపోయినా.. హుజురాబాద్‌లో ట్రయాంగిల్ టఫ్ ఫైట్ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో.. ఇప్పటి వరకూ గెలుపుపై బిందాస్‌గా ఉన్న కమలనాథుల్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది. అందుకే, రేవంత్‌రెడ్డి ఎంట్రీ తర్వాతే బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు పాదయాత్ర ప్రకటించారు. తాజాగా, ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను కలిసి మరింత వ్యూహరచన చేశారు.
ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా అయిన ఆయన.. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా హుజురాబాద్ సర్వే రిపోర్టులు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ కేంద్ర సర్వేల ప్రకారం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుస్తారనే సర్వేలు వచ్చినట్టు బీజేపీ నేతలు చెప్పారు. ఎన్నికలకు ముందే హుజురాబాద్‌లో అమిత్‌షాతో ఓ బహిరంగ సభ నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఈటల రాజేందర్ చేయబోయే పాదయాత్రకూ అమిత్‌షాను ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర నాయకులు. తెలంగాణలో పాగా వేసేందుకు ఎన్నిసార్లైనా వస్తానని అమిత్‌షా హామీ ఇచ్చారు.
ఢిల్లీలో అమిత్‌షా నూరిపోసిన ధైర్యం.. కేంద్ర సర్వేల సమాచారంతో కమలనాథుల్లో మరింత జోష్ పెరిగింది. ఇక హుజురాబాద్‌లో గెలుపు తమదేనంటూ మరింత ఉత్సాహంగా పని చేయబోతున్నారు. మరి, బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బ్రేకులు వేస్తాయా? లేక, ఈటల-కాషాయ సునామీలో కొట్టుకుపోతారా?