కేంద్రం డీఏ పెరిగింది.. ఏపీ ఉద్యోగులకు ఎప్పుడో మరీ..?
posted on Jul 14, 2021 @ 7:43PM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూకేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డిఎ 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది.ఏడవ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేబినెట్ డిఎ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 1 నుంచి పెంచిన డిఎ అమలు కానుందని కేంద్ర స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పినట్టు అయింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రెస్ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఎ పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.డీఏ పెంపు వల్ల రూ.34,401 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందని వివరించారు. ఈ నిర్ణయంతో 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ చెప్పారు.
కేంద్ర సర్కార్ తమ ఉద్యోగులకు డీఏ పెంచడంతో ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఏపీ సర్కార్ ఇప్పటికే ఏడు డీఏలు పెండింగులో పెట్టింది. ఇక కొత్త డీఏ ఎప్పుడు ప్రకటిస్తుందన్నది చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన? అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి సరికాదంటూ ఆయన ట్వీట్ చేశారు.
కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టిందని చంద్రబాబు చెప్పారు. పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదని అన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి సరికాదన్నారు చంద్రబాబు.