కౌన్సిలర్లా? గోపీలా? సిగ్గు.. సిగ్గు..
posted on Jul 14, 2021 @ 6:47PM
మొన్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు. నిన్న బీజేపీ నాయకులు. ఇవాళ మళ్లీ గులాబీ ప్రజాప్రతినిధులు. గోడ మీద పిల్లుల్లా ఎటు పడితే అటు దూకేశారు వాళ్లు. రాజకీయ విలువలకు తూట్లు పొడిచారు. ఓట్లు వేసి ఎన్నుకున్న జనాలతో చివాట్లు తింటున్నారు. దుబ్బాక కేంద్రంగా నడిచిన పొలిటికల్ డ్రామా.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. కౌన్సిలర్ల ఎపిసోడే అయినా.. రాష్ట్ర స్థాయి నేతల ఎంట్రీతో రంజుగా మారింది. పతనమవుతున్న రాజకీయ విలువలకు నిదర్శనంగా మిగిలింది. బీజేపీ, టీఆర్ఎస్‌ల రాజకీయ క్రీడలో ప్రజాస్వామ్యం అబాసుపాలైంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు జరిగిన ఈ ఎపిసోడ్‌తో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది.
దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, డివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్‌లు కాషాయ కండువా కప్పుకున్నారు. పక్కపార్టీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకొని.. తామూ ఆ తానుముక్కులమేనని నిరూపించుకున్నారు కమలనాథులు. పేరుకు కౌన్సిలర్లే అయినా.. వారి కోసం ఏకంగా బీజేపీ బడాబడా నేతలే తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి, విజయశాంతిలతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో ఆ ముగ్గురు.. మొనగాళ్లలో ఫోజు కొడుతూ కాషాయ శిబిరంలో చేరిపోయారు. పోతూపోతూ రొటీన్‌గా టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఇక దుబ్బాకలో బీజేపీదే హవా అన్నట్టు అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి.. ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
కట్ చేస్తే.. తెల్లారేసరికి సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు చక్రం తిప్పారు. ఆ ముగ్గురు కౌన్సిలర్లలో ఇద్దరు మళ్లీ గులాబీ గూటికి చేరిపోయారు. హరీశ్‌రావు వారికి గులాబీ కండువలు కప్పి.. మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. బీజేపీది ఒక్కరోజు మురిపంగా మిగిలిపోయింది. తెరముందు కథ ముగిసిపోయింది. తెరవెనుక అసలు కథ నడిచిందంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారేటప్పుడు.. మళ్లీ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరేటప్పుడు.. ఆ ఇద్దరు కౌన్సిలర్లకు బాగానే గిట్టుబాటు అయిందంటున్నారు. ఒక్కరోజు గ్యాప్‌లోనే వారి దశ తిరిగిపోయిందని చెబుతున్నారు.
అసలు వాళ్లెందుకు అధికార పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లినట్టు? ఒక్కరోజులోనే వారికి ఏం జ్ఞానోదయం అయిందని మళ్లీ వెనక్కి వచ్చేసినట్టు? ఎవరైనా ఈజీగానే గెస్ చేయొచ్చు. ఆ ముగ్గురు కేవలం పాత్రలు మాత్రమేనని.. నాటకమంతా పార్టీలదేనని. హుజురాబాద్ ఎన్నికల ముందు అధికారపార్టీని మానసికంగా దెబ్బకొట్టేందుకు.. ముగ్గురు కౌన్సిలర్లను బీజేపీలోకి లాగారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. మావాళ్లనే గుంజుకుంటారా అని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ యాక్షన్‌కు దిగారు. ముగ్గురిలో ఇద్దరిని సక్సెస్‌ఫుల్‌గా వెనక్కి లాగేసుకుని చప్పట్లు కొట్టించుకున్నారు. ఇలా కౌన్సిలర్ల కోసం.. రెండు పార్టీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం.. కౌన్సిలర్లను గోపీలుగా మార్చడం.. రాజకీయంగా విమర్శల పాలవుతోంది. పార్టీలు, నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇదేమి రాజకీయాలు.. సిగ్గు.. సిగ్గు.. అంటూ చీదరించుకుంటున్నారు. పార్టీలు మాత్రం అన్నీ తుడిచేసుకొని.. కొత్త ఎత్తుగడకు సిద్ధమవుతున్నాయి.