ఉద్యోగాల భర్తీ ఉత్తదేనా..? ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ డ్రామాలా..?
posted on Jul 15, 2021 @ 12:30PM
అవిగో ఉద్యోగాలు.. ఇవిగో నోటిఫికేషన్లు.. తెలంగాణలో గత నాలుగేండ్లుగా సాగుతున్న తంతు ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం.. అధికారులు హడావుడి చేయడం.. నిరుద్యోగులు ఆశతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తకుండా సర్కార్ సైలెంట్ కావడం.. ఎప్పటిలానే నిరాశతో నిరుద్యోగులు నిట్టూర్చడం కామన్ గా సాగుతోంది. అందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పినా.. నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతం తెలంగాణ యువత.
తాజాగా మరోసారి ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేస్తోంది. ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వం కొన్ని రోజులుగా హడావుడి చేస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందనే రేంజ్ లో పాలకులు, అధికారులు కలరింగ్ ఇచ్చారు. కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈసారి పక్కా అనుకున్నారు. కాని రోజులైనా గడుస్తున్నా నోటిఫికేషన్ల జాడ లేకపోగా.. బుధవారం మరో బాంబ్ పేల్చింది కేసీఆర్ సర్కార్. కసరత్తు అంతా పూర్తైంది, ఖాళీలను గుర్తించడం జరిగిందని వారం రోజులుగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పూర్తి వివరాలను అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందనే ప్రకటన వచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా అధికారులు ఏం కసరత్తు చేశారు, కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు, మళ్లీ వివరాలు ఇవ్వాలని కోరడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. సర్కార్ వాలకం చూస్తుంటే ఈసారి కూడా నోటిఫికేషన్లు వచ్చేది అనుమానమే అన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కలిపి మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రిమండలికి వివరాలు కూడా సమర్పించింది. దీంతో బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఖాళీల భర్తీపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూశారు. కానీ, ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతించే అంశం మళ్లీ వాయిదా పడింది. అధికారులు అందించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సమగ్ర వివరాలను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఖాళీల వివరాలు అందించడానికి మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది.కాలానుగుణంగా, ఆధునిక అవసరాల మేరకు పోస్టులు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులను రప్పించాల్సి ఉందని, వీటితో పాటు మిగిలిపోయిన ఖాళీలన్నీ కలిపి సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత ఖాళీల వివరాలను ప్రజల ముందుంచుదామని తెలిపింది.
ఉద్యోగాల ఖాళీలు గుర్తించాలంటే కేడర్ పోస్టులపై ముందు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. జోనల్ పోస్టులను ఖరారు చేయాలి. ఇవన్ని పూర్తయితేనే ఖాళీల పూర్తి వివరాలు తెలుస్తాయి. కాని తెలంగాణలో గత ఏడేండ్లుగా కేడర్ విభజనే జరగలేదు. కొత్త జిల్లాలకు సర్దుబాటు పద్దతిలోనే ఉద్యోగులను కేటాయించారు. ఆ పోస్టులను కూడా క్రమబద్దీకరించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇవేమి చేయకుండానే సర్కార్ హడావుడి చేయడంతో.. కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా ఉద్యోగుల విభజన జరగాలని కేబినెట్ స్పష్టం చేసింది. తద్వా రా జిల్లాలు, జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల వల్ల ఏర్పడే ఖాళీల భర్తీకీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 200 నుంచి 300 మంది ఉద్యోగులను ఏపీ నుంచి తీసుకురాబోతున్నామని వివరించింది. ఇలా అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్ర నుంచి వచ్చే ఉద్యోగులను కలుపుకొని, ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.
కేసీఆర్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో సీఎం కేసిఆర్ మరోసారి మోసానికి తెరలేపారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మొదట కమల్‌నాథన్ కమీషన్ పేరుతో కాలాయాపన చేశారని ఆయన ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఉద్యోగాలని అంటున్నాడని..ఇక వాటిని కూడా కొత్తగా జిల్లా, జోన్లు, మల్టీజోన్లు, స్టేట్ బేసిస్ లో కొలువుల భర్తీ అంటూ తేనెతుట్టెను కదిపారని బండి సంజయ్ అన్నారు. దీంతో అవి భర్తి అయ్యోందుకు కాలయాపన చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.ఇలా ఎన్నికలు వచ్చాయంటే యువతను మభ్యపెట్టడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.ఇలా గత ఎన్నికల్లో ప్రకటనలు చేశారని,కాని ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని అన్నారు.
సీఎం కేసిఆర్ కు నిరుద్యోగులపై కనీసం చిత్తశుద్ది లేదని బండి సంజయ్ విమర్శించారు.ఉద్యోగాలు భర్తి చేసేందుకు టైం ఫ్రేం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఇక ఉద్యోగ ఖాలీలపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. ఉద్యోగ ఖాలీలతో జిల్లాలో అభివృద్ది కుంటుపడడంతో పాటు పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.నిరుద్యోగ ఖాలీలతో అనేక చోట్ల ఇంచార్జులతో నెట్టుకువస్తున్నారని దీని వల్ల ఉద్యోగులపై పని భారం ఎక్కువైందని చెప్పారు బండి సంజయ్.