పీకే ఆట భలే బాగుందిగా.. విపక్షాలను ఆడిస్తున్నారుగా!
posted on Jul 15, 2021 @ 7:02PM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అయన సోదరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాలతో సమావేశమయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని మీడియాలో బ్రేకింగులొచ్చాయి. ఆ వార్త రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది. అనేక ఊహాగానాలు షికారు చేశాయి.
అయితే ఇందులో ఏది నిజం ఏది కాదు అనేది ఎవరికీ తెలియదు.సోనియా,రాహుల్, ప్రియాంక త్రయంలో ఏ ఒక్కరూ మీడియాలో షికారు చేసిన వ్యూహాగానలపై స్పందించలేదు. ప్రశాంత్ కిశోర్’తో మూడు గంటలు ఏమి చర్చించారో, ఎవరికీ చెప్పలేదు. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం, సమావేశంలో వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే యూపీ , పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంశం ఒక్కటే కాదు, ఇంకా పెద్ద విషయమే చర్చకు వచ్చిందని, అంటున్నారు. అయితే ఆ మ ‘పేద్ద’ విషయం ఏమిటో మాత్రం గోప్యంగా ఉంచారు.
అయితే, ఈ సమావేశంలో తనను రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే అంశం చర్చించినట్లు వచ్చిన పుకార్ల పై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఆ పుకార్లను అయన ఖండించారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని ఓడించడం ఉమ్మడి ప్రతిపక్షానికి అయినా అయ్యేపని కాదని, తేల్చి చెప్పారు. బీజేపీకి 300 మందికి పైగా ఎంపీలున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నాటికి కూడా బీజేపే సంఖ్యా బలం మారదు. అలాంటప్పుడు ప్రతిపక్షాల అభ్యర్ధి గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు, అని పవార్ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసునని, తాను రాష్ట్రపతి రేసులో లేనని, స్పష్టం చేశారు. అలాగే, 2024 ఎన్నికల కోసం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పవార్ తెలిపారు.
ప్రశాంత్ కిశోర్ ముంబైలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తనతో రెండుసార్లు సమావేసమైనా, ఈ రెండు సందర్భాలలో రాష్ట్రపతి ఎన్నికలు లేదా 2024 సార్వత్రిక ఎన్నికల అంశమే చర్చకు రాలేదని ఆయన వివరించారు.అంతే కాదు, ప్రశాంత్ కిశోర్’తో ఇంతవరకు రాజకీయ అంశాలేవీ తనతో చర్చించలేదని కూడా పవార్’ చెప్పారు. అయితే, అన్నేసి గంటలు ఏమి చర్చించారు, ఏమి చేశారు, అనేది ఆయన చెప్పలేదు. కానీ, పాత్రలు వేరైనా రాజకీయాలలో నిండామునిగిన ఇద్దరు ప్రముఖులు రాజకీయాల గురించి చర్చించకుండా ఉండరు,అయినా అసలు రాజకీయాలే చర్చించలేదంటే, పవర్ కూడా ఎదో దాస్తున్నారనే అనుకోవలసి వస్తుంది.
సరే అదల ఉంటే, రాహుల్ గాంధీ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు చేపడుతున్నారు అంటూ వచ్చిన బ్రేకింగ్ న్యూస్’కూడా నిజం కాదని అంటున్నారు. అంటే కాదు, ప్రస్తుతం ఓకే సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్’ ను మార్చే ఆలోచన కూడా అటకెక్కిందని, ప్రస్తుతానికి అధీర్ అంజనే, ఈ పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. మొత్తానికి పీకే తోలు బోమ్మలాట బానే ఆడిస్తున్నారు.మాస్ సినిమా పాటలో లాగా పీకే కూర్చున్నా, నుంచున్నా అది న్యూసై కూర్చుంటోంది.