భలే భలే పులస.. ఈసారి ధర ఎంతో తెలుసా..? సీజన్ వచ్చేసిందోచ్...
posted on Jul 15, 2021 @ 7:58PM
అన్నీ తిని చూడు.. పులస తినిచూడు. చూడ చూడ రుచుల.. పులస రుచియే వేరయా. నాన్‌వెజ్ ఐటమ్స్ ఎన్నున్నా.. పులస పులుసు ముందు అవన్నీ దిగదుడుపే. అందుకే, రుచిలోకి మేటి అయిన పులసకు అంత డిమాండ్. కేవలం కొన్ని రోజులు మాత్రమే.. అది కూడా గోదావరి ప్రాంతంలో మాత్రమే దొరికే పులస కోసం స్థానికులతో పాటు ఎక్కడెక్కడి వారంతా తరలివస్తుంటారు. ఎంత ధర అయినా పెట్టి.. పులస కొనేందుకు ఎగబడతారు. అందుకే, పులస రేటు.. ఏటికేటికి తారాజువ్వలా రయ్ రయ్ మంటూ పైపైకి చేరుతోంది. వానాకాలం మొదలు కావడంతో మళ్లీ పులస సీజన్ ప్రారంభమైంది. వలకు చిక్కిన చేపలకు వేలం పాట కూడా మొదలైపోయింది. ధర కూడా దండిగానే పలుకుతోంది.
యానాం, ఉభయ గోదావరి జిల్లా చేపల మార్కెట్లో పులసకు ఈఏడాది కూడా ఎప్పటిలానే ఫుల్ డిమాండ్ పలుకుతోంది. తాజాగా, యానాంలో గౌతమి గోదావరిలో ఓ పులస చేప జాలర్లకు చిక్కింది. ఈ చేపను కొనేందుకు స్థానికులు పోటీపడ్డారు. వేలంపాటలో అది 6 వేలు ధర పలికింది. చేప బరువు సుమారు కిలోకు పైగా ఉంది. అంటే, కిలో చేపకు 5వేల వరకూ పలికినట్టు. వర్షాకాల సీజన్ మొదలై వరదలు వస్తుండటంతో ఇక మరిన్ని పులస చేపలు వలకు చిక్కుతాయని స్థానిక జాలర్లు సంబరపడుతున్నారు.
జీవితంలో ఒక్కసారైనా పులసను రుచి చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటున్నారు. ఎంతో రుచికరమైన పులస చేప ధర ఎక్కువే పలికినా.. వాటిని కొనేందుకు పోటీపడుతుంటారు చేపల ప్రియులు. అందుకే నీటిలో ఉండే పులస చేప ధర ఎప్పుడూ చుక్కలను తాకుతూ ఆకాశంలోనే ఉంటుంది. గోదావరి నదిలో మాత్రమే లభించడం వీటి ప్రత్యేకత. వరద నీరు సముద్రంలోకి వెళ్లే క్రమంలో.. ఆ వరద ఉధృతికి వ్యతిరేకంగా ఈది.. సముద్రం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తుంటాయి పులస చేపలు. మట్టితో కూడిన వరద నీటికి ఎదురీది వెళ్లడం వల్లే వీటికి ఇంత రుచి వస్తుందని అంటుంటారు. ఇలా బంగాళాఖాతం నుంచి గోదావరిలోకి ఈదుతూ వచ్చే పులసలు.. జాలర్ల వలకి చిక్కి.. కాసులు కురిపిస్తాయి. చేపల ప్రియులకు జిహ్వ చాపల్యం తీరుస్తాయి. అందుకే, పులస స్పెషాలిటీయే వేరు...