పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తాం.. ఏం చేస్తారో చేసుకోండి?
posted on Jul 15, 2021 @ 4:18PM
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ పీసీసీ పిలుపిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం టెన్షన్ పుట్టిస్తోంది. ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ తీయాలని కాంగ్రెస్ నిర్ణయించగా... అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరా పార్క్ దగ్గర నిరసనకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అది కూడా రెండు మైకులు మాత్రం ఉపయోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలు, కొవిడ్ రూల్స్ దృష్ట్యా రాజ్ భవన్ వరకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం లేదని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
సిటీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఛలో రాజ్ భవన్ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. శుక్రవారం 'ఛలో రాజ్ భవన్' చేపడుతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపారు. పెట్రో ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తీరుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. పోలీసులు అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని, నిర్బంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్ని జైళ్లలో పెడతారో, ఎన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తారో చూస్తాం అని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై మోదీ, కేసీఆర్ కలిసి ప్రజల నుంచి రూ.35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంటును కూడా స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్‌లా ఉందన్నారు. 2020 డిసెంబర్‌లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్పష్టమైంది. ఆ నివేదిక ఉండగా కొత్తగా లెక్కలు తేల్చేదేంటి అని ప్రశ్నించారు. వాస్తవంగా 1.91 లక్షల ఖాళీలు ఉండగా... 56 వేలు దాటడం లేదన్నట్టు దొంగ లెక్కలేంటి అని నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని... అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.