అయ్యో రోజా... పార్టీ పెద్దలే పొగ పెడుతున్నారా?
posted on Jul 15, 2021 @ 6:40PM
అధికార వైసీపీలో నోరున్న నాయురాలిగా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజాకు.. రోజులు కలిసిరావడం లేదా, ఆమెకు రోజురోజుకు ఇంటిపోరు పెరుగుతోందా? పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి చిత్తూరు జిల్లా వైసీపీ కీలక నాయకులు ఎవరితోనూ ఆమెకు సయోధ్యత లేదన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో ఆమెకు ఉన్న ఇమేజికి, నియోజకవర్గం నగరిలో ఆమెకున్నపట్టు, పలుకుబడికి పొంతన లేదని అంటారు. అందరితోనూ ఎదో ఒక సమయంలో ఆమెకు విబేధాలున్నాయని అంటారు. అందుకు తగ్గట్టుగానే గతంలో కొంతకాలం రోజా, డిప్యూటీ సీఎంనరాయణ స్వామి మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్’లో దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని,అందరినీ అశ్చర్యపరిచారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పేరున్న మంత్రి, జిల్లాలో పార్టీ రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనూ, రోజాకు విబేధాలున్నాయి. ఒక దశలో ఆ ఇద్దరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచాద్రరెడ్డి తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో రోజా ఉన్నట్లు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, రోజా మంత్రి పెద్ది రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అదే సోషల్ మీడియాలో ద్వారా చెప్పుకున్నారు. అంతేకాదు. సయోధ్య చిహ్నంగా రక్షా బంధన్ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు. ఆవిధంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలను పంపారు.అంతకు ముందు అదే పెద్ది రెడ్డి టార్గెట్’ గా ఆమె పార్టీలో కొంత మంది తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని బహిరంగంగానే వాపోయారు. ఓ దశలో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు.
తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లో మరో మారు పార్టీలో వర్గపోరు భగ్గుమంది. రోజా వర్గం ఆమె ప్రత్యర్ధి వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కేజే శాంతికి వర్గం విడివిడిగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించడంతో పార్టీలో వర్గపోరు మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్’గా తీసుకుందని అంటున్నారు. దివంగత నేత వైఎస్ జయంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దృష్టిలో ఈ కార్యక్రమం విధేయతను రెన్యువల్ చేసుకోవడంగా భావిస్తారని అంటారు. అలాంటిది వైఎస్ జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో చర్చనీయాంసంగా మారింది.
మత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజా టార్గెట్ ఆమె ప్రత్యర్ధి వర్గం పావులు కదపడం చూస్తుంటే.. పార్టీ పెద్దలే తేరా వెనక నుంచి కథ నడుపుతున్నారు అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అంతే కాదు రోజాను పొమ్మన కుండా పొగపెట్టే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు పార్టీలో వినవస్తున్నాయి.