చదువుకున్నోళ్లకు హమాలీ ఉద్యోగం.. గొప్పగా చెప్పుకున్న మంత్రి
posted on Jul 16, 2021 @ 10:05AM
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. దిగజారి ప్రవర్తిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నించిన వారిపై జులూం ప్రదర్శిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మంత్రి మరింత ఓవరాక్షన్ చేశారు. ఉద్యోగాల కల్పనైప మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేలాది మందికి హమాలీ పని కల్పించామని, చదువుకున్నోళ్లకు హమాలీగా అవకాశం కల్పించామని గొప్పగా ప్రకటించుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన దిశ సమీక్షలో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలియ్యలేమని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏటా ఐదు నెలలపాటు హమాలీ పని చేసుకునే వెసులుబాటు ఉందని, ఇంతకుమించిన ఉపాధి ఏముంటుందని అన్నారు. ‘ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్ అంటే ఇదే..’ అని హమాలీ పని గురించి ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రంలో, పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ ఉద్యోగాలు పీకేసి, ఇక్కడ మాత్రం ఇవ్వాలని ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్మలకు పాల్పడితే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వానకాలం, యాసంగి సీజన్లలో రెండు నుంచి రెండున్నర నెలలు సొంత పనులు చేసుకుంటూనే హమాలీ పని చేసునునే వెసులుబాటు రాష్ట్రంలో గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకుమించిన ఉపాధి ఏముంటదని నేను అడుగుతున్న.. ఉపాధి అంటే ఇది కాదా అంటున్న.. ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్ అంటే ఇదే.. ఇలాంటి విషయాలను చర్చకు పెట్టకుండా సదువుకున్నోళ్లందరికీ సర్కారు నౌకర్లు కావాలంటే ఎట్ల?’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
చదువుకున్నోళ్లకు హమాలి పని కంటే బెటరేంటీ అంటూ వ్యాఖ్యలు వివాదం కావడంతో మంత్రి మళ్లీ వివరణ ఇచ్చారు. తాను నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఉపాధి అవకాశాలు పెంచామని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని అన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నారని తాను అన్నట్టుగా ప్రచారం చేయడం విచారకరమన్నారు.
మరోవైపు నాగర్ కర్నూల్ టౌన్లో దిశ రివ్యూ మీటింగ్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి అన్న మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ.. వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్సోషల్ మీడియా ఇన్చార్జి గంగాపూర్ విక్రమ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లయింట్ మేరకు వే2న్యూస్, దిశ డైలీ డాట్ కమ్, 6టీవీ, టీవీ9 యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు వనపర్తి టౌన్ ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో కూడా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్.. డీఎస్పీ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.