మంత్రుల చాటుమాటు యవ్వారం.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
posted on Jul 15, 2021 @ 4:41PM
చట్టాలు చేసేది పాలకులు. వాటిని అమలు చేసేది అధికారులు. పాటించాల్సింది ప్రజలు. మరి, ప్రజలకు వర్తించే రూల్స్ రూలర్స్‌కు వర్తించవా? ఎలాగూ చట్టాలు చేసేది వాళ్లే కాబట్టి.. చట్టం తమ చుట్టం అంటూ మడిచి జేబులో పెట్టుకుంటారా? రూల్స్‌ను బేఖాతరు చేస్తారా? రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్. అనేది తెలంగాణలో వర్తించదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలో పొగాకు, గుట్కా అమ్మకాలను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులైతే.. వారికి వేరే పని ఏదీ లేనప్పుడల్లా.. మామూళ్లు రానప్పుడల్లా.. గుట్కా దందాపైనే దాడులు చేస్తుంటారని అంటారు. ఎవరైనా గల్లీ పాన్‌షాపుల్లో గప్‌చుప్‌గా గుట్కా అమ్మితే వారిపై కేసులు బుక్ చేసి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. మరి, ఇంత చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరి, తమ మంత్రులే ఓపెన్-సీక్రెట్‌గా గుట్కాలు తింటుంటే..? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..? అలాంటి మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నట్టు..?
తాజాజా, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ వీడియో మరింత ఆసక్తికరంగా ఉంది. అందులో.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి మరో మంత్రి గంగుల కమలాకర్.. సీక్రెట్‌గా గుట్కా తీసుకోవడం.. టపక్కున నోట్లో వేసుకొని.. ఏం తెలీనట్టు మాస్క్ పెట్టుకోవడం.. ఇదంతా ఇంకో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో జరగడం.. ఆ రహస్య గుట్కా బదిలీ కార్యక్రమమంతా ఎంచక్కా వీడియోలో రికార్డు అవడం.. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కలకలం మొదలైంది. మంత్రులు గుట్కాలు తినేంత చీపా? అనే చర్చ ఓవైపు.. నిషేధిత పొగాకు మంత్రులే వాడుతుంటే.. చర్యలు తీసుకోరా? అనే డిమాండ్ మరోవైపు.. నెటిజన్లు తెలంగాణ మంత్రులను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.
ఇక దాసోజు తన ట్వీట్‌లో పలు డిమాండ్లు కూడా చేశారు. తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు? బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా? అంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు. తన ట్వీట్‌ను తెలంగాణ సీఎమ్‌వో, తెలంగాణ సీఎస్, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేసి మరింత రచ్చ రాజేశారు.
మంత్రుల గుట్కా యవ్వారంపై సోషల్ మీడియాలో గట్టి పనిష్మెంటే పడుతోంది కానీ, మరి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. చట్టం ముందు అంతా సమానులేనని.. నిరూపిస్తారా? లేక, గుట్కానే కదాని గప్‌చుప్‌గా ఊరుకుంటారా? ఇక్కడ మంత్రులు గుట్కా తినడం ఒక్కటే కాదు మేటర్.. ఆ గుట్కా వారి వరకూ ఎలా వచ్చింది? ఎవరు సప్లై చేస్తున్నారు? మంత్రులకు తెలిసే గుట్కా దందా నడుస్తోందా? గుట్కా స్మగ్లర్లకు మంత్రుల అండాదండా ఉందా? ఇలాంటి అనుమానాలన్నీ నిగ్గు తేలాల్సిన అవసరం ఉందంటున్నారు.