హైదరాబాద్ లో మరో ఐటీ హబ్.. ఎక్కడో తెలుసా?
posted on Jul 15, 2021 @ 7:02PM
మన దేశంలో ఐటీ అనగానే బెంగళూరుతో పాటు వినిపించే పేరు తెలంగాణ రాజధాని హైదరాబాద్. గత కొన్నేండ్లుగా భాగ్యనగరంలో ఐటీ వేగంగా వృద్ధి చెందుతోంది. కొవిడ్ కల్లోల సమయంలోనూ హైదరాబాద్ ఐటీ గణనీయమైన వృద్ధి సాధించింది. ఐటీ ఎగమతుల్లో ప్రతి ఏటా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం నాలుగున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగాలు ఉన్నారని తెలుస్తోంది. ఐటీపై ఆధారపడి మదో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.
హైదరాబాద్ నగరానికి నలువైపులా ఐటీ రంగం విస్తరిస్తోంది. ఐటీ రంగానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ భాగ్యనగరం బాట పట్టాయి. తాజాగా మరో ఐటీ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని పరిసర గ్రామాల్లో ఐటీ హబ్‌కు అనుకూలంగా ఉందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుర్తించింది.
హైటెక్ సిటీ తరహాలో ఇక్కడ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.ఐటీ హబ్ కోసం సమీకరించే భూములకుగాను భూ యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల ద్వారా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని హెచ్‌ఎండీఏ ప్రాథమిక అంచనా వేస్తోంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తోంది.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు తెలిపారు. మారిన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైనదని, సమర్థతకు నైపుణ్యం కూడా తోడైతే తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు లభించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని వివరించారు.