ఈటల రాజేందర్ హ్యాండ్సప్! భయమా? వ్యూహమా?
posted on Jul 18, 2021 @ 2:17PM
హుజురాబాద్ ఉప ఎన్నిక. ఈటల రాజేందర్ సత్తాకు ప్రతీక. హుజురాబాద్‌లో గెలిచి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాలనేది ఆయన టార్గెట్. అయితే, ఈటలను ఓడించి.. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలనేది కేసీఆర్ పంతం. అందుకే, కేసీఆర్-ఈటలలు నువ్వా-నేనా అన్నట్టు తలబడుతున్నారు. రాజేందర్ బీజేపీలో చేరి.. వెయ్యి ఏనుగుల బలం సమీకరించుకున్నారు. కేసీఆర్ తన అధికారబలాన్నంతా హుజురాబాద్‌లో మోహరించి ఈటలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ ఇంకా యాక్టివ్ కాకపోయినా.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాకతో రాజకీయం మరింత రంజుగా మారింది. ఇక, హుజురాబాద్‌లో హోరాహోరీ తప్పదంటూ సంకేతాలు. ఇంతటి కీలక సమయంలో ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే...
"పోటీలో నేను ఉన్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటే. ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఎవరు పోటీ చేసినా.. గుర్తు అదే ఉంటుంది". జమునా చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారాయి. హుజురాబాద్ పోటీ నుంచి ఈటల రాజేందర్ తప్పుకుంటున్నారా? రాజేందర్‌కు బదులు ఆయన భార్య జమున బరిలో దిగుతున్నారా? బీజేపీ అందుకు సరేనంటుందా? అదే జరిగితే.. అలానే ఎందుకు? ఇదంతా భయమా? లేక, బీజేపీ వ్యూహమా? ఇలా అనేక ప్రశ్నలు, అంతకుమించి అనుమానాలు. జమున స్టేట్‌మెంట్స్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈటలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్ ... ఇప్పటికే హుజురాబాద్ పై ఫోకస్ చేశారు. ఈటల వెంట టీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లకుండా ముఖ్యనేతలను రంగంలోకి దింపారు. మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా ఈటల నియోజకవర్గంపైనే దృష్టి సారించగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తనకు అత్యంత సన్నిహితుడైన హరీష్ రావును మోహరించడంతో.. పోటీపై ఈటల వెనుకాడుతున్నారని తెలుస్తోంది.
తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అందుకే తనకు రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు జమునను పాలిటిక్స్ లోకి అరంగ్రేటం చేసే యోచనలో రాజేందర్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు జమున గెలిస్తే ఓకే.. ఓడినా.. పెద్దగా నష్టం ఉండదనే ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
హుజురాబాద్ లో పోటీపై తన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు కూడా రాజేందర్ చెప్పారని.. వాళ్లు కూడా సానుకులంగా స్పందించారని తెలుస్తోంది. ఈటల సూచనతో నియోజకవర్గంలో ఇప్పటికే జమున యాక్షన్ మొదలు పెట్టారని చెబుతున్నారు. గతంలోనూ హుజురాబాద్ పార్టీ కార్యక్రమాలను జమున చూసేవారు. మంత్రిగా ఈటల బిజీగా ఉండటంతో.. నియోజకవర్గ పనులను ఆమె చక్కపెట్టేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జమునను పోటీ చేయించాలని రాజేందర్ ప్రయత్నించారు కూడా. అప్పుడు కుదరకపోవడంతో.. ఇప్పుడు తన తరఫున జమునను రంగంలోకి దించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈటల నేరుగా బరిలో దిగితే.. ఈటల వర్సెస్ కేసీఆర్‌గా పోటీ మారుతుందని.. టీఆర్ఎస్ మరింత కసిగా ట్రై చేస్తుందని.. అదే జమున దిగితే.. అధికారపార్టీని కన్ఫ్యూజన్‌లో పడేసి.. మరింత దెబ్బతీయడంతో పాటు.. మహిళ కార్డు కూడా బాగా వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అటు, బీజేపీ సైతం అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈటల అయితే, గెలుపంతా ఆయన ఖాతాలోనే పడుతుందని.. అదే జమునా అయితే, బీజేపీకి కూడా క్రెడిట్ బాగా వస్తుందని లెక్కలేస్తోంది. అలా, బీజేపీ, ఈటల ఫ్యామిలీ కలిసి.. హుజురాబాద్‌లో రాజేందర్ కాకుండా జమునతో పోటీ చేయించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇది భయంతో కూడిన వ్యూహమంటున్నారు.