పెత్తనం రెడ్డిగారికి.. ఊడిగం వెనకబడినవారికి! జగనన్న.. నువ్ తోపన్నా..!
posted on Jul 18, 2021 @ 11:12AM
మాట తప్పరు.. మడమ తిప్పరు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడతారు. చరిత్రలో లేని విధంగా బలహీనవర్గాలకు పదవులిస్తారు. మహిళలకు అర్ధభాగం పైనే వాటా ఇస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డిగారి స్క్రిప్టు... కాని అదేంటో దేవుడు రాసిన స్క్రిప్టు వేరేగా ఉంది. మాట తప్పరు.. కాని ముసుగేస్తారు.. మడమ తిప్పరు.. కాని మెడే తిప్పేస్తారు.. విలువలకు, విశ్వసనీయతలను జాగ్రత్తగా ఫ్రిజ్ లో పెడతారు..అంటే వాటిని చావనీయరు.. బతకనీయరన్నమాట. బలహీనవర్గాలకు బలహీన పదవులిస్తారు.. మహిళలకు అర్ధభాగంపైనే నీటి మూటలిస్తారు. నామినేషన్ పదవుల పేరుతో చేసిన హంగామా చూసి ఏదో అనుకున్నవారికి.. మళ్లీ పాత చింతకాయ పచ్చడే అది కూడా రెడ్డిగారి పచ్చడే పెట్టారని అర్ధమైపోయింది.
తెలుగుదేశం పాలనలో కమ్మవారికి చంద్రబాబునాయుడు దోచిపెట్టేశారని జగన్ వీధివీధిన అరిచి గోల పెట్టారు. జనం నిజమేనేమో అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగారు రెడ్డివార్లకు వడ్డిస్తున్న తీరు చూసి..కమ్మవారికి చంద్రబాబునాయుడు మీద కోపం నషాళానికి అంటుతోంది. ఏమన్నా అడిగితే వాళ్లేమంటారో.. వీళ్లేమంటారో అంటాడు.. జగన్ ను చూసి నేర్చుకోవాలి.. ఎంత చక్కగా తనవాళ్లకి ఎంత బాగా చేసుకుంటున్నాడో అని తిట్టుకుంటున్నారు.
అదేంటి..బలహీనవర్గాలకు అంత పర్సంటేజి, మహిళలకు ఇంత పర్సంటేజి ఇస్తే.. మీరేంటి ఇలా అంటారనుకోకండి. జాగ్రత్తగా మంచి పదవులన్నీ పొట్లాల్లో కట్టేసి...ఆ పదవులేమో రెడ్డివార్లకు ఇచ్చేసి... పొట్లాం కాగితాల్లాంటి పదవులేమో బలహీనవర్గాలకు, మహిళలకు ఇచ్చేశారు. పొట్లాల కాగితాలు ఎక్కువుండటంతో.. ఏదో చాలా ఇచ్చేశామని రచ్చ రంబోలా చేసేస్తున్నారు. అసలు సంగతి పదవులు తీసుకున్నోళ్లకు మాత్రమే కరెక్టుగా అర్ధమవుతుంది. ఆ లిస్టులో అసలు పని లేని పదవులు బోలెడన్ని ఉన్నాయి. అసలు పని ఉండి, నిధులున్న సంస్థలను లెక్కేసి లిస్టు సెపరేటుగా వేస్తే..99 శాతం రెడ్డిగార్లే కనపడతారు మనకి. కాని చిన్నా, చితక అన్నీ కలిపేసి లిస్టు పెద్దది చేసి.. దానికి పర్సంటేజీలు కట్టేసి.. చాలా ఉద్ధరించేశామని ఊదరగొడుతున్నారు. వైసీపీ రెడ్డిగార్లు కూడా జగన్ గారి ఈ చమత్కారానికి బహు ముచ్చట పడుతున్నారంట.
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు సీఎం జగన్ రెడ్డి. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని గొప్పగా చెప్పారు మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల లెక్క చూసిన వారు నిజమే అనుకునేలా కవరింగ్ ఇచ్చారు. తీరా ఏ పోస్టులు ఎవరికి దక్కాయో చూస్తే అసలు సంగతి బయటపడింది. జగనన్న ఎంత తోపే మరోసారి తెలిసిచ్చింది. నిధులు ఎక్కువగా ఉండే కార్పొరేషన్లను రెడ్లకు కట్టబెట్టి.. అసలు కార్యాలయాలే లేని కార్పొరేషన్లు, బడ్జెట్ ఎంతో తెలియని, ఆ పోస్టు అంటూ ఉందని కూడా తెలియని నామినేటెడ్ పోస్టులను బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారన్నది తేలిపోయింది. ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్, మారిటైం బోర్డ్, సివిల్ సప్లైస్, పోలీస్ హౌసింగ్, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి వంటి కీలక పదవులన్ని రెడ్డి వర్గానికే ఇచ్చారు.
నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకం ఏపీఎస్ ఆర్టీసీ. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ఈ పదవిని నిర్వహించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పోస్టును మల్లికార్జున రెడ్డికి ఇచ్చారు జగన్ రెడ్డి. మరో కీలక పోస్టు ఏపీఐఐసీ. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రోజా ఇప్పటివరకు ఈ పదవిని నిర్వహించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోయిందుకు కీలకమైన ఈ పోస్టును కట్టబెట్టారు జగన్. ఇప్పుడు కూడా ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు. నిధులు ఎక్కువగా ఉండే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ద్వారంపూడి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు జగన్ రెడ్డి.
కీలకమైన ఏపీ మారిటైం బోర్డ్ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. బడ్జెట్ భారీగా ఉండే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి అపాయింట్ అయ్యారు. స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ పదవిని బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి అప్పచెప్పారు జగన్ రెడ్డి. జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ పోస్టులను వివిధ వర్గాలను పంచేసిన జగన్ సర్కార్.. రాష్ట్ర స్థాయిలో కీలకమైన అప్కాబ్ చైర్మెన్ పోస్టును మాత్రం మల్లెల ఝాన్సీరెడ్డికి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవిని పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డికి కట్టబెట్టారు. కీలకమైన పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి, రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డిని నియమించారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని అపాయింట్ చేశారు జగన్ రెడ్డి.
ప్రభుత్వం వచ్చిననాటి నుంచి అన్ని కీలక పదవుల్లో రెడ్డిగార్లకు పెద్ద పీట వేసిన జగనన్న.. తన స్పీచ్ లో మాత్రం రెడ్డిగార్లను పక్కనపెట్టి బలహీనవర్గాలు, మహిళల గురించి వాయించేస్తున్నాడు. ఆఖరికి కీలకమైన అధికారిక పదవుల్లో కూడా వారినే ఏరికోరి వేయిస్తున్నారు. పై నుంచి కింద వరకు కీలక పదవులన్నిటిలో వారే నిండిపోయారు. కింద పదవుల్లో మిగతావాళ్లుంటారు. మొత్తం కలిపి మనకు లెక్కలు చెబుతుంటారు. సూటిగా చెప్పాలంటే పెత్తనం చేసే పదవులున్నీ రెడ్డివార్లకే, ఊడిగం చేసే పదవులున్నీ బలహీనవర్గాలు, మహిళలకే. చూద్దాం మరి ఎన్నాళ్లు మోసం చేస్తారో..మోసపోయేవారు ఇంకెన్నాళ్లు మోసపోతారో.