టీఆర్ఎస్ కు మాజీ మంత్రి గుడ్ బై? క్లారిటీ ఇచ్చిన మహేందర్ రెడ్డి...
posted on Jul 18, 2021 @ 12:29PM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేయడంతో మొదలైన రాజకీయ వేడి.. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈటల బీజేపీలో చేరడంతో.. కమలం పార్టీలో జోష్ కనిపించింది. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు కాషాయ గూటికి చేరారు. ఇంతలోనే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో పొలిటికల్ అటెన్షన్ అంతా ఆయన వైపు మళ్లింది. రేవంత్ కు పగ్గాలు రావడంతో హస్తం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు సీఎం కేసీఆర్. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారు ఎక్కేశారు. త్వరలోనే మరికొందరు నేతలు గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు.
అధికార, విపక్షాలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండటంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏ లీడర్ ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో తెలియకుండా పోయింది. తమకు ఏ నాయకుడు హ్యాండిస్తారో అన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ నేత పార్టీ మారుతున్నారని, ఇంకో లీడర్ ఫలానా పార్టీలో చేరబోతున్నారనే కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న విభేదాలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. తర్వాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో పట్నం, పైలెట్ వర్గాల మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. చాలా సార్లు బహిరంగంగానే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. నియోజకవర్గంలోని అధికారులు కూడా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి తనకు సపోర్ట్ లేదని మహేందర్ రెడ్డి తన అనుచరులతో చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పట్నం.. పార్టీ మారుతారని చాలా మంది అనుకుంటున్నారు.
అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నానని తన ప్రత్యర్థి వర్గం చేస్తున్న ప్రచారం నిజం కాదని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను పార్టీ మారబోనని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని పట్నం స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తాను టీఆర్ఎస్ లో సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు పట్నం మహేందర్ రెడ్డి.