కేసీఆర్ ను ఇరికించిన పల్లా.. రేవంత్ దెబ్బ మాములుగా లేదుగా!
posted on Jul 18, 2021 @ 9:57AM
రేవంత్ కు టీడీపీ వాసన పోలేదని కామెంట్ చేసి విమర్శల పాలైన కేటీఆర్ ను చూసి కూడా టీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలగలేదు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ శ్రేణులే నవ్వుకుంటున్నారు. పదవులు అనుభవించి పార్టీ మారే వాళ్లకు బుద్ధి చెప్పాలని.. గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని ఈటల రాజేందర్ ను దృష్టిలో పెట్టుకొని పల్లా కామెంట్ చేశారు. దీంతో అరెరె.. పల్లా ఇలా ఎందుకు మాట్లాడావని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే.. రేపు హుజూరాబాద్ అభ్యర్థి ఎల్ రమణో, కౌశిక్ రెడ్డో అయితే రివర్స్ అవుతుందనేది వారి బాధ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడితే.. మనకే నష్టమని అంటున్నారు.
నిజానికి కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో.. ఎవరిని పార్టీలోకి చేర్చుకుంటాడో.. ఎవరికి సీటు ఇస్తాడో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఏదిబడితే అది మాట్లాడితే తర్వాతి రోజుల్లో చిక్కుల్లో పడతామని అంటున్నారు పార్టీ శ్రేణులు. పైగా ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన, అనుభవిస్తున్న వారిని చేర్చుకుంటూ పార్టీ మారే వాళ్లకు బుద్ధి చెప్పాలని అనడం ఏంటని గులాబీ దళమే నవ్వుకుంటోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న ఎల్ రమణను చేర్చుకుంటూ.. ఈటల పార్టీకి ద్రోహం చేశాడు.. ఆయనకు బుద్ది చెప్పాలని అనడం హాస్యాస్పదం కాదా..? అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసానిని మంత్రి వర్గంలోకి తీసుకున్నాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.. ఇప్పుడు హుజూరాబాద్ లో పలు పార్టీల్లో గెలిచిన కౌన్సిలర్లను, ఇతర ప్రజాప్రతినిధులను లాగేశాం.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చాంతాడంత ఉంది. పార్టీలో ముప్పావు వంతు ఇతర పార్టీల నాయకులే ఉన్నారన్న సంగతి మర్చిపోయారా..? అని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసిన వారిని తరిమికొట్టాలి అని పిలుపునివ్వడంలో అర్థం లేదని చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.
ఈటలపై చేసిన కామెంట్స్.. పలు పార్టీల్లో సుదీర్ఘ కాలం పదవులు అనుభవించి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిని వారికి కూడా వర్తిస్తాయని గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ప్రజలు దీన్ని పట్టుకుని నిలదీస్తే ఏం సమాధానం చెబుతామని పల్లాను ప్రశ్నిస్తున్నారు. గతంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న డోర్నకల్ నుండి రెడ్యానాయక్ ను మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించి మంత్రిని చేసి, అయన కుమార్తెను సైతం గెలిపించిన కాంగ్రెస్ కు.. అధికారం పోగానే ఆయన కుటుంబం టీఆర్ఎస్ లో చేరింది. ఇది కాంగ్రెస్ కు ద్రోహం చేయడమే కదా.. అలాగే రమణను నమ్మి చంద్రబాబు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే రాజీనామా చేసి మన గూటికి చేరడమంటే ద్రోహం కాదా..? కౌశిక్ రెడ్డి చేసింది ద్రోహం కాదా..? ఇలా అనేక మంది ఆయా పార్టీల్లో అనేక పదవులు అనుభవించి అధికారం పొగానే టీఆర్ఎస్ లోకి చేరారని.. అలాంటివారిని దగ్గర పెట్టుకొని ఈటలకు బుద్దిచెప్పాలి.. తరిమికొట్టాలని అనడం గురిగింజ సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.