కాంగ్రెస్ గూటికి దేవేందర్ గౌడ్? రేవంత్ పిలుపుతో ఏకమవుతున్న లీడర్లు..
posted on Jul 18, 2021 @ 12:47PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పీసీసీ చీఫ్ గా వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్న రేవంత్ రెడ్డి.. పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు. బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న లీడర్లు తిరిగి సొంత గూటికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా నేతలను కలుస్తూ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలకు గాలం వేస్తున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవెందర్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఆదివారం సాయంత్రం దేవేందర్ గౌడ్‌తో ఆయన భేటి కాబోతున్నారు. తక్కుగూడలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. రేవంత్‌తోపాటు ప్రచార కమిటి చైర్మన్ మధుయాస్కి గౌడ్, ఎఐసీసీ కార్యక్రమాల కమిటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు వెళ్లనున్నారు. దేవేందర్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి టీమ్ సాదరంగా ఆహ్వానించబోతోంది.
దేవేందర్ గౌడ్ తో పాటు ప్రస్తుతం బీజేపీలో ఉన్నఆయన తనయుడు వీరేందర్ గౌడ్, పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరేందర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- టీడీపీ పొత్తులో భాగంగా ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. వీరేందర్ గౌడ్ కు మొదటి నుంచి రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరేందర్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ లో చేరవచ్చని అనుకుంటున్నారు. దేవేందర్ గౌడ్ కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తే బీసీ వర్గం నుంచి తమకు భారీగా మద్దతు పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. కేసీఆర్ గద్దే దింపేందుకు తమతో కలిసి రావాలని కోరుతున్నారు. రేవంత్ ఆహ్వానంతో ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ తనయుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు సంజయ్ రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా సొంత గూటికి చేరడానికి ఆసక్తి చూపారు.