ఆ ఊళ్లో అంతా సంస్కృతమే..
posted on Jul 18, 2021 @ 6:31PM
ఆ ఊళ్లో ఏ ఇంట్లోకి వెళ్లినా.. ఎవరి నోటి నుంచి విన్నా సంస్కృత భాషా సుగంధాలే విరజిమ్ముతాయి. గుడ్ మాణింగ్ లు, గుడ్ నైట్ లాంటి ఇంగ్లిష్ భాషా పదాలు మచ్చుకైనా కనిపించవు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో గల మత్తూర్ లో శతాబ్దాలుగా ఇదే పరిమళం గుబాళిస్తోంది. శిమోగా నుంచి మత్తూర్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 5 వేల జనాభా గల మత్తూర్ లో ప్రజలందరూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ తమ కార్యకలాపాలు, ఆచార వ్యవహారాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా సంస్కృతంతోనే ముడివడి ఉంటాయి. ప్రతి వ్యక్తీ 8, 9 ఏళ్ల వయసు నుంచే సంస్కృత శ్లోకాలు వల్లె వేస్తూ ఉంటాడు. అలాగని ఇతర భాషలు నేర్చుకోరని కాదు. పాఠశాలలో ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా అవన్నీ సబ్జెక్టు వరకే. సంస్కృతం అనేది వారి మాతృభాషగా మారింది. కాబట్టి వారి అమ్మ భాషలోనే అన్ని వ్యవహారాలూ పూర్తి చేస్తారు.
జీన్స్ ప్యాంట్స్ వేసుకునే యూత్ అయినా సరే... ఊళ్లో ఉన్నారంటే సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. ఊళ్లోకి వేరే ప్రాంతపు అతిథులు ఎవరైనా వస్తే వారితో కన్నడంలో లేదా అవసరమైనవారికి ఇంగ్లిష్ లో జవాబిస్తారు. అయితే సంస్కృతం మీద వీరికి గల ప్రేమాప్యాయతలు, వారి మర్యాదల కారణంగా ఊళ్లోకి వచ్చిన అతిథులు సైతం గీర్వాణంలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూంటారు. ఇక ఈ గ్రామానికున్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. సంస్కృతంతో పాటు వీరు ఇతర సబ్జెక్టుల్లో కూడా నూటికి నూరు శాతం మెరిట్స్ సాధించడం. అంటే సంస్కృత అభ్యాసం కారణంగా ధారణ శక్తి పెంపొందుతుందన్న మన పెద్దల మాటలు నిజమేనని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 600 ఏళ్ల క్రితం కేరళ నుంచి బ్రాహ్మల్లోని సంకేతి అనే తెగకు చెందినవారు మత్తూర్ కు వలస వచ్చారు. అప్పట్నుంచీ వాళ్లు సంస్కృతాన్నే వారసత్వంగా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ప్రజలు కూడా సంస్కృతంలోనే వ్యవహరించడం విశేషం.
ఇక మత్తూర్ కు సమీపంలోనే కవల పల్లె లాంటి మరో ఊరుంది. అదే హోసహళ్లి. తుంగ నది ఒడ్డున గల హోసహళ్లి.. మత్తూర్ తో స్ఫూర్తి పొందింది. కొన్నేళ్లుగా ఇక్కడ కూడా ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. సంస్కృతం నేర్చుకొని అమల్లో పెట్టిన తరువాత తమ భాషా వ్యవహారాలు పరిణతి చెందాయని, ఆచారపరంగా ఎంతో గొప్పనైన ఫీలింగ్ కలుగుతుందని హోసహళ్లి ప్రజల సామూహిక అభిప్రాయం.