యడ్డీ ఉద్వాసన మళ్ళీ వాయిదా? ఆ వర్గం ఆయన్నే కాపాడిందా?
posted on Jul 17, 2021 @ 8:59PM
కర్ణాటక ముఖ్యమత్రి యడ్యూరప్ప మరో మారు పదవీ గండంనుంచి తప్పించుకున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు మరో అవకాశం ఇచ్చిందా? ఇంకొద్ది రోజులు అధికారంలో కొనసాగేందుకు ఒప్పుకుందా? అంటే స్పష్టమైన సమాదానం అయితే రావడం లేదు,కానీ, ఆ మేరకు సంకేతాలు అయితే అందుతున్నాయి.
పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జులై 16, శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ చేరుకున్న యడ్యూరప్ప గత రాత్రే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని రాజకీయ అంశాల చర్చకు అవకాశం ఇవ్వలేదని. పరిపాలనపరమైన అంశాల వరకు చర్చించి, రాజకీయ అంశాలను,హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించమని సూచించినట్లు సమాచారం.
కాగ, యడ్యూరప్ప ఈ రోజు (శనివారం) రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు నడ్డాతో సమావేసమయ్యారు. అయితే సమావేసం అనంతరం, పార్టీ నాయకత్వం తనను రాజీనామా చేయమని కోరలేదని, పార్టీని బలోపేతం చేయాలని మాత్రమే నడ్డా చెప్పారని యడ్యూరప్ప అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా పనిచేస్తానని తాను హామీ ఇచ్చినట్లు కూడా యడ్యూరప్ప వివరించారు. అలాగే, “నేను రాజీనామా చేస్తునట్లు వస్తున్న వార్తల వాస్తవం కాదు .. నేనే సీఎంగా కొనసాగుతాను” అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ఆగష్టు మొదటి వారంలో మళ్ళీ ఢిల్లీ వస్తున్నట్లు ఆయన చెప్పారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ అధినాయకత్వం కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో సందేహం లేదు. అయితే, ముఖ్యమంత్రి మార్పుతో సున్నితమైన కుల సమీకరణలు ముడిపడి ఉన్నందున, యడియూరప్పను గౌరవప్రదంగా పంపాలని పార్టీ నాయత్వం చూస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శివకుమార్, యడ్యూరప్ప పేరు చెప్పకుండా ఆయన కులానికి (లింగాయత్) చెందిన అనేక మంది బీజేపీ నాయకులు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ బాంబు పేల్చారు. ఈ నేపధ్యంలో ఆయనను అగౌరవంగా బయటకు పంపిస్తే, గతంలో లాగా, మరోమారు రాజకీయంగా దెబ్బతినవలసి ఉంటుందని పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది.
ఈ నెల 26తో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి. అంతవరకు అయనను పదవిలో కొనసాగించాలని, ఆగష్టు మొదటి వారంలో మళ్ళీ మరోమారు చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, యడ్డీని తొలిగించడం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరద్ సింగ్ ని తీసేసినంత సులువు కాదని మాత్రం కమల త్రయానికి మరోమారు అర్థమైనట్లే వుంది. చివరకు ఏమి జరుగుతుందో .. చూడవలసి వుందని పార్టీ వర్గాలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి .