అయ్యో షర్మిల.. అడ్డంగా బుక్కైపోయావా..?
posted on Jul 18, 2021 @ 9:25PM
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల దూకుడుగా వెళుతోంది. టీఆర్ఎస్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న షర్మిల.. కేసీఆర్ కుటుంబంపైనా విరుచుకుపడుతోంది. దొర పాలనంటూ విమర్శలు చేస్తూ.. పంచ్ డైలాగులు విసురుతోంది. జిల్లాలు కూడా చుట్టేస్తున్న షర్మిల.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ ను కడిగిపారేస్తోంది. అయితే ఆమె దూకుడే ఇప్పుడామెకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షర్మిలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ వాదులు కూడా షర్మిలపై కామెంట్లు చేస్తున్నారు. ఏపీకి చెందిన వారు కూడా కేటీఆర్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో కేటీఆర్ విషయంలో షర్మిల తొందరపడ్డారని, అడ్డంగా బుక్కయ్యారనే చర్చ సాగుతోంది.
మీడియా సమావేశంలో కేటీఆర్ అంటే ఎవరు అని వెటకారంగా ప్రశ్నించింది షర్మిల. ఆ తర్వాత కేసీఆర్ వాళ్ల అబ్బాయి కేటీఆర్ అని చెబితే.. ‘ఓహో అవునా.. కేసీఆర్ వాళ్ల అబ్బాయి కేటీఆరా’ అంటూ షర్మిల పరువు తీసేలా వ్యంగ్యంగా స్పందించింది. ఈ డైలాగులే వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపైనే షర్మిలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. షర్మిల గతంలో కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన పాజిటివ్ వ్యాఖ్యల వీడియోలను నెటిజన్లు, టీఆర్ఎస్ మద్దతుదారులు బయటకు తీశారు. షర్మిలను ట్యాగ్ చేస్తూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.
షర్మిల గతంలో లోకేష్ ను కించపరచడానికి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఆ వీడియోను బయటకు తీసి ‘కేటీఆర్ తెలియదా? షర్మిలమ్మా’ అంటూ ట్రోల్ చేస్తున్నారుగతంలో లోకేష్ ను విమర్శించడానికి కేటీఆర్ ను వాడుకొని ఇప్పుడు తెలియదంటావా? అని షర్మిలను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షర్మిల సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో కేటీఆర్ ను అంతగా పొగిడిన షర్మిల ఇప్పుడు కేటీఆర్ ఎవరో తెలియదంటావా? అని ఎద్దేవా చేస్తున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా గతంలో తెలంగాణలో చేసిన అశ్లీల పోస్టులను తొలగించాలని ఇదే కేటీఆర్ మంత్రిగా నాడు ఆదేశించాడని.. షర్మిలకు ఈ విషయాన్ని తాము గుర్తు చేయాలనుకుంటున్నామని కొందరు టీఆర్ఎస్ నేతలు పోస్టులు పెట్టారు.
మొత్తంగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు షర్మిల. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు అధికారికంగా మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.