మల్లన్న మహా పాదయాత్ర.. కొత్త పార్టీకి ఆరంభమా?
posted on Jul 18, 2021 @ 7:36PM
తీన్మార్ మల్లన్న. మాస్ మల్లన్న. ఏడేళ్లుగా కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న మల్లన్న. యూట్యూబ్ ఛానెల్‌తో కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి చుక్కలు చూపించిన మల్లన్న. ఇంతమంది మల్లన్నల ప్రతిరూపం ఒకే ఒక్కడు.. అతనే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తెలంగాణలో ఇప్పుడతను ఓ వ్యక్తి కాదు..శక్తి. కేసీఆర్‌లాంటి కొండను పిండి చేసేంత ధైర్యం ఉన్న సామాన్యుడు. జనంలో ఒక్కడు. ఆ మల్లన్న ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు ఎప్పటినుంచో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీకంటే ముందుగా.. పాదయాత్రతో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి సలసల కాగుతోంది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీలన్నీ కొత్త రెక్కలు తొడుక్కుంటున్నాయి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్, ఈటల రాజేందర్ చేరికతో బీజేపీ.. మరింత బలోపేతమయ్యాయి. మరోవైపు, తెలంగాణ కోడలినంటూ వైఎస్ షర్మిల కొత్తపార్టీతో ఒక్క ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇలా తెలంగాణ రాజకీయం కీలక అంచెకు చేరుకుంది. పొలిటికల్ జంక్షన్‌లో నిలబడి పాత, కొత్త పార్టీలన్నీ తమ లక్ష్యం దిశగా దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో నేనుసైతమంతూ ముందుకొస్తున్నారు తీన్మార్ మల్లన్న. పాదయాత్రతో మంచి ప్లాట్‌ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.
తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు తీన్మార్ మల్లన్న. అందుకు టైమ్, ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలిపారు. పాదయాత్రకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తానని చెప్పారు. మరోవైపు, మల్లన్న టీమ్‌ల రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను కూడా ప్రకటించారు. ఈ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండటంతో తీన్మార్ మల్లన్న పక్కా వ్యూహంతోనే ముందుకు పోతున్నారని అంటున్నారు.
పాదయాత్ర ప్రకటన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు తీన్మార్ మల్లన్న. తమ పార్టీలో చేరాలంటూ కొందరు నేతలు ఆహ్వానించారని చెప్పారు. అయితే, ఇప్పటికైతే తాను ఏ పార్టీలో చేరబోవటం లేదని తెలిపారు. అంటే, త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనేగా అర్థం? అంటున్నారు ఆయన అభిమానులు. అదే సమయంలో, తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేయడం చూస్తుంటే.. వైఎస్సార్‌టీపీ టార్గెట్‌గానే మల్లన్న ముందుకొస్తున్నారని కూడా అంటున్నారు. కేసీఆర్-జగన్‌లు కుమ్మక్కై.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలతో రాజకీయ పార్టీని పెట్టించారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో, షర్మిల పార్టీకి కౌంటర్‌గా తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టబోతున్నారనే అనుమానమూ వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా, ఇప్పటికైతే పాదయాత్రకే పరిమితమైనా, పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. త్వరలో చేయబోయే పాదయాత్ర, భవిష్యత్‌లో పార్టీ ఆవిర్భావానికి దారి తీస్తుందని అంటున్నారు.
తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే కేసీఆర్‌కు మరింత డ్యామేజీ తప్పకపోవచ్చు. ఇటీవల జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కొద్ది తేడాతో రెండో స్థానంలో నిలిచి.. దాదాపు గెలిచినంత పని చేశారు. గులాబీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈ మూడు జిల్లాల పరిధిలో పాదయాత్ర చేశారు మల్లన్న. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడారు. అందుకే, ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ బరిలో నిలిచి.. అంత ప్రభావం చూపించగలిగారు. ఇప్పుడిక తెలంగాణవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి.. రాజకీయ పార్టీతో ముందుకొస్తే ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పటికే తెలంగాణలో పలు పార్టీలు బలంగా కొట్లాడుతుండగా.. ఇప్పుడిక మల్లన్న ఎంట్రీతో కేసీఆర్‌కు తీన్మార్ తప్పకపోవచ్చు అంటున్నారు.