ఉప ఎన్నికలకు జగన్ ప్లాన్ ? వైసీపీ నేతల్లో టెన్షన్..
posted on Jul 18, 2021 @ 11:41AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోసారి జనంలోకి వెళ్లి తమ బలాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా? అందుకోసంగా ఉప ఎన్నికల పథకాన్ని సిద్ధం చేస్తున్నారా? అంటే ... అవుననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో చంద్రబాబు ఐదేళ్ళు కష్టపడి గాడిలో పెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా స్థితికి చేరుకుంది.అప్పుల భారం ఇంతై ఇంతింతై .. అన్నట్లుగా కొండలా పెరిగింది. అప్పుల భారానికి ఏక్షణంలో అయినా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి అధః పాతాళంలోకి కూరుకు పోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులే పేర్కొంటున్నారు. కొత్తగా అప్పులు పుట్టే దారులు కూడా ఒకటొకటిగా మూసుకు పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంతకాలం జగన్ రెడ్డి పంపకాలకు మురిసిపోయిన మాములు జనం కూడా.. ముందు ముందు కష్టాలు తప్పవని, కడుపు చేతపట్టుకుని వలసలు పోవలసిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేక పెరుగుతున్నసంకేతాల కనిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్వేల ద్వారా కాకుండా నేరుగా జనంలోకి వెళ్ళి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతలను బేరీజు వేసుకునేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఉప ఎన్నికలకు వెళితే జనం నాడిని పట్టుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఇదే విషయాన్ని ఆయన తమ సన్నిహితుల వద్ద చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఆ స్థానంతో పాటు మరో ఐదు చోట్ల జగన్ ఉపఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
బెంగాల్ సహా పలు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఏర్పడిన ఖాళీలకు రానున్న ఒకటి రెండు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు వెంటనే ఉప ఎన్నిక నిర్వహించాలని వినతి పత్రం సమర్పించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి నిలబడాలంటే అర్జెంటుగా ఉప ఎన్నిక జరగడం అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి,ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నవంబర్ 4 వ తేదీలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితేనే, పదవిలో కొనసాగుతారు.కాదంటే ఆమె రాజీనామా చేసి మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించవలసి వస్తుంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘంపై వత్తిడి తెస్తోంది. ముందు ముందు వత్తిడి మరింత పెంచుతుంది.
ఎన్నికల సంఘం కూడా ఏ కారణంగా అయినా ఖాళీ అయిన స్థానానికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తప్ప ఉప ఎన్నికను ఆరు నెలలకు మించి వాయిదా వేసే అవకాశం ఉండదు. కాబట్టి రానున్ను రెండు మూడు నెలలో బెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటుగా రాష్ట్రంలోని బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని జగన్ రెడ్డి బృదం భావిస్తోంది. ఈ నేపద్యంలో పనిలో పనిగా, తెలుగు దేశం టికెట్ పై గెలిచి, దొడ్డిదారిన వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి చేత రాజీనామా చేయించి, ఆ నాలుగు స్థానాలకు, అదే విధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు చేసి న రాజీనామాను ఆమోదించి ఆ స్థానాన్ని ఉప జాబితాలో కలిపి మొత్తం ఆరు స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నికలు జరిపితే ప్రజల నాడి తెలిసిపోతుందని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఉప ఎన్నికలలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని ఆ పార్టీ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నివురుగప్పిన నిప్పుల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఉప ఎన్నికల్లో భగ్గుమంటే, కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పార్టీలో కొందరు హెచ్చరించినట్లు సమాచారం. అయితే జగన్ రెడ్డి, ఎవరి మాటా వినని సీతయ్యలా ముదుకు పోతారా? లేక ... కీడెంచి మేలెంచడం మంచిదని వెనకడుగు వేస్తారా.. చూడవలసి వుంది.