జీతాల కోసం మాన్సస్ ఉద్యోగుల ధర్నా..
posted on Jul 17, 2021 @ 6:34PM
మాన్సస్ సంస్థ.. ఉత్తరాంధ్రలో వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సంస్థ. లక్షలాది మందికి విద్యాజ్యోతులు అందించిన సంస్థ. కాని ఇప్పుడా సంస్థ కుట్ర రాజకీయాలకు బలై పీకల్లోతు చిక్కుల్లో పడింది. మాన్సస్ సంస్థ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. 15 నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ మాన్సస్ సంస్థ ఉద్యోగులు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది.
మాన్సాస్ సారథ్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. మాన్సస్ ఈవో వెంకటేశ్వరరావు ను దాదాపు రెండు గంటలుగా నిర్బంధించారు. తమకు పదహారు నెలలుగా జీతాలు నిలిపివేయడం అన్యాయం అని ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో వ్యవహారంతోనే తమ జీతాలు నిలిచిపోయాయని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగుల ఆందోళనతో అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మాన్సాస్‌లో ఉండేటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన కార్యనిర్వహణాధికారి.. సిబ్బందికి జీతాలు చెల్లించకూడదని బ్యాంకుకు లిఖిత పూర్వకమైన ఆదేశాలు జారీ చేయడంతోనే వివాదం చెలరేగింది. మాన్సాస్ ఛైర్మన్ జీతాలు చెల్లించమని చైర్మన్ లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చెప్పినప్పటికీ.. ఇష్యూ కోర్టులో ఉన్నందున ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేయమని ఈవో లేఖ రాయడంతో ఆందోళనలు చెలరేగాయి. ఛైర్మన్ మాటకు గౌరవం ఇవ్వకుండా ఈవో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మాన్సాస్ ఉద్యోగులు తీవ్రమైన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ధర్నాకు సంబంధించి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన సంచయిత.. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవో ని బెదిరించడానికి సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మీ అన్నయ్య ఆనంద గజపతి రాజు జన్మదినం రోజున ఇలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించడం మీకు సిగ్గుగా లేదా? అంటూ అశోక్ గజపతి రాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి, దివంగత నాయకులు ఆనంద గజపతిరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిల గజపతిరాజు నివాళులర్పించారు. ఆయన సమాధి వద్ద పుష్ఫగుచ్చాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఊర్మిళ గజపతిరాజు.. సింహాచలం భూముల వ్యవహారం విషయంలో ఏం జరుగుతుందో తమకు తెలియదన్నారు. తాను కూడా అందరిలాగే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని చెప్పారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందన్నారు. ఈ వివాదం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నానని అన్నారు. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉందని, ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని తెలిపారు.