కేసీఆర్ వ్యతిరేకులంతా ఏకమయ్యారా! ఈటలదే గెలుపా..? గులాబీలో గుబులు అందుకేనా?
posted on Jul 19, 2021 @ 7:07PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్. కుదిరితే తాను, కుదరకపోతే తన భార్య జమున.. ఇద్దరిలో ఒకరు హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉండనున్నారు. ఉప ఎన్నికలో తన గెలుపుతో అధికారంలోకి వచ్చేది లేదు.. మరోసారి మంత్రి అయ్యేదీ కుదరదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఓ మూలన కూర్చోవాల్సి ఉంటుందనే క్లారిటీ ఈటలకు ఉంది. అయినా.. ఎమ్మెల్యే పదవి కోసం ఆయన అంతలా ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. తన గెలుపు.. సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు కావాలనేది ఆయన పట్టుదల. హుజురాబాద్‌లో గెలిచి.. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలనేది ఆయన పగ, ప్రతీకారం. తానేదో రాజ్యమేలాలని కాకుండా.. బానిస భవన్‌గా మారిన ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాలనేది ఆయన సంకల్పం. అందుకే, ఈటల దంపతులు హుజురాబాద్‌లో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. 23 రోజుల పాటు.. 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల మేర పాదయాత్రతో.. 'ప్రజా జీవన యాత్ర' పేరుతో ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
హుజురాబాద్‌లో ఎలాగైనా గెలవాలని ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేస్తున్నారు ఈటల రాజేందర్. పాదయాత్ర నిర్ణయం అందులో భాగమే. తాజాగా, తన బదులు తన భార్య జమునారెడ్డిని బీజేపీ తరఫున పోటీ చేయించాలని చూస్తున్నారు. అందుకు కమలం పార్టీ సైతం సై అనడంతో.. బహుషా హుజురాబాద్ బరిలో నిలిచేది జముననే కావొచ్చంటున్నారు. ఈటల వర్సెస్ కేసీఆర్ ఫైట్‌ను కాస్తా.. జమున వర్సెస్ టీఆర్ఎస్‌గా మార్చేస్తున్నారు.
అటు, అధికారపక్షం సైతం వ్యూహాత్మకంగా దాడి చేస్తోంది. హుజురాబాద్ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగే పోరు కాదని.. పార్టీల మధ్య జరిగే వార్ అంటూ కేటీఆర్ ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల వర్సెస్ కేసీఆర్‌గా పోరు సాగితే.. ఈటలకే అడ్వాంటేజ్ ఎక్కువ. అయ్యో పాపం.. అన్నేళ్లు పార్టీలో ఉన్న ఈటలను అన్యాయంగా బయటకు వెళ్లగొట్టారనే సానుభూతి ఆయనకు బాగా కలిసొస్తుంది. అందుకే, ఈటలకు ఆ అదనపు ప్రయోజనం దక్కకుండా చేసేందుకే, ఇది రెండు పార్టీల మధ్య జరిగే సంగ్రామంగా మాటల గ్యారడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ వేసే ఎత్తుగడలకు విపక్షాలు సైతం అదే స్థాయిలో విరుగుడు మంత్రం ప్రయోగిస్తున్నాయి. ఈ ఒక్కసారికి తాము ఓడినా పర్లేదు.. ఈటల గెలవాలంటూ అన్నిపార్టీలు, అన్నివర్గాలు ఈటల రాజేందర్‌కు సహకరిస్తున్నాయని అంటున్నారు. ఈటల బీజేపీ నుంచి పోటీ చేసినా.. పార్టీని చూడకుండా.. ఈటలను చూసి.. ఆయన కేసీఆర్‌పై తిరగబడిన ధోరణి చూసి.. అంతా ఆయనకే తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకతతో ఉన్న అన్నివర్గాలు ప్రజలు, నాయకులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు.. కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు ఇదే మంచి అవకాశమని.. ఈటలను గెలిపించుకొని.. గులాబీ బాస్‌కు బుద్ధి చెప్పాలని తమవంతుగా అంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సైతం హుజురాబాద్ విషయంలో పట్టుదలకు పోకుండా.. ఎలాగూ తమది కాని ఆ సీటుపై పట్టుదలకు పోకుండా.. పరోక్షంగా ఈటల గెలిచేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కారులు, కోదండరాం సార్ సైతం ఈటలకే జై కొడుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఈటల గెలుపునకే కృషి చేస్తానంటున్నారు. ఇలా.. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తదితర వేరు వేరు వర్గాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి.. ఒక్కమాట మీద నిలబడి.. ఒకే ఒక్కడు ఈటల రాజేందర్‌ను గెలిపించి.. కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
ఈటల కుటుంబం బీజేపీ తరఫునే పోటీ చేసినా.. ఇక్కడ పార్టీని కాకుండా కేండిడేట్‌ను చూసి.. కేసీఆర్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి అంతా సిద్దమవుతున్నారని తెలుస్తోంది. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ పోటీ చేసినా, లేదంటే జమునారెడ్డి బరిలో నిలిచినా.. ఈటల ఫ్యామిలీనే గెలిపించాలని.. ప్రగతి భవన్‌లో ప్రకంపణలు పుట్టేలా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన మెసేజ్ ఇచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్నారంతా.. అదే జరిగితే హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఝలక్ తగలవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసే గులాబీ నేతలు గుబులు పడుతున్నారని అంటున్నారు. మండలానికో మంత్రిని ఇంచార్జ్ గా నియమించారని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ ఏం చేసినా.... కేసీఆర్ వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైతే మాత్రం హుజురాబాద్ వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.