కూతుర్ని తల్లి చేసిన తండ్రి..
posted on Jul 20, 2021 @ 11:27AM
ఈ ప్రపంచంలో కనిపించే దేవుళ్ళు అమ్మానాన్న. పిల్లలకు అమ్మానాన్న అంటే నాలుగు అక్షరాలా పదాలే కాదు.. వంద ఏళ్ళ నిండు జీవితం కూడా. పిల్లల చేతి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సిన వాడు ఫాదర్. కానీ తల్లిదండ్రులే పిల్లల జీవితాలపై నిప్పులు వేస్తున్నారు. తాజాగా హైదారబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కామంతో కన్నకూతురునే త్రాచు పామై కాటేశాడు. ఏకంగా తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. భార్య, భర్తలు ఇద్దరూ చెరో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె(16), కొడుకు(14) ఉన్నారు. అయితే, సొంతూరిలో చదువును మానేసిన బాలిక.. తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇక్కడే వారితో ఉంటోంది. అయితే, కామంతో కన్నూమిన్నూ కానని ఆ నీచుడు.. కన్న కూతురుపైనే కన్నేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకున్నాడు అందుకు అందుకు పధకం వేశాడు. ఆ పధకం అమలు చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాడు.
ఈ క్రమంలో భార్య ఇళ్లలో పనికి వెళ్లగానే.. అతని పధకం అమలు చేయడానికి అవకాశం దొరికింది. కూతురుకుని అన్నంలో నిద్రమాత్రలు కలిపి వడ్డించేవాడు. అలా ఆ బాలిక మత్తులోకి జారుకోగానే.. ఈ నీచుడు ఆమెపై ఒక మృగం లా అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా అనేకసార్లు జరుగగా.. నిద్రమత్తులో ఉన్న బాలికకు అదే తెలియకుండాపోయింది. అక్కడితో ఆ నీచుడు ఆగక ఇటీవల నేరుగానే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించేవాడు. అయితే, ఇటీవల బాలిక గర్భవతి అని తేలడంతో.. ఆమె తల్లి నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ తల్లికి వివరించింది. భర్త చేసిన పనికి రగిలిపోయిన ఆ తల్లి.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.